మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్‌కు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అందరూ స్థానిక అధికారులు, ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ 24x7 హెల్ప్‌లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392 సంప్రదించాలని తెలిపింది.
పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్‌లో విస్తృత స్థాయిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ అయింది. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా అవకాశం కొట్టిపారేయకపోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది.
ఈ పరిణామాల ప్రభావంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రజా ఆశ్రయాలను తెరవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలో “అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండటం మంచిది” అనే ఉద్దేశంతో అన్ని ప్రజా ఆశ్రయాలను తెరవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రయత్నాలు
ఇరాన్‌లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్‌లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.


