
అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్‌ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 వీడియో యాప్‌లు, వెబ్‌సైట్‌ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పోర్నోగ్రఫిక్ సహా అభ్యంతకర కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్‌ల, వెబ్‌సైట్‌ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.
భారత్‌లో పోర్న్‌సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్‌లు అధికారికంగానే పోర్న్, సాఫ్ట్ పోర్న్‌ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్‌టీటీ(ఏక్తాకపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిలింస్‌కు చెందిన యాప్, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.
అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్ కంటెంట్ ఇదే తరహా యాప్‌ల ద్వారా ప్రమోట్ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్’(ట్విటర్) లాంటి పాపులర్ ఓపెన్ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరసా లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ తదితరాలు ఉన్నాయి.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.