అగ్రస్థానంలో నాడార్ అండ్ ఫ్యామిలీ
తర్వాతి స్థానాల్లో అంబానీ, బజాజ్, బిర్లా
మొత్తం విరాళాలు రూ.10,380 కోట్లు
‘హురున్ ఇండియా’ తాజా జాబితా
మనదేశంలో అగ్రశ్రేణి సంపన్నులు.. సంపాదనపైనే కాదు, సేవా కార్యక్రమాలపైనా దృష్టిపెడుతున్నారు. వీరు విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఏడాది వెచ్చించింది రూ.10 వేల కోట్లకు పైగానే! ‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024–25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ.2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. తరవాతి స్థానాల్లో ముకేష్, అంబానీ, బజాజ్ కుటుంబం ఉన్నాయి.
‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా’ జాబితా ప్రకారం.. హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన శివ్ నాడార్, ఆయన కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు రూ.7.4 కోట్లు సేవా కార్యక్రమాలకు వినియోగించింది. మొత్తంగా వారి విరాళాలు 2023–24తో పోలిస్తే 26 శాతం పెరిగాయి. రెండో స్థానంలో ఉన్న రిలయ¯Œ ్స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం ఎక్కువగా రూ. 626 కోట్ల సేవా కార్యక్రమాలకు వెచ్చించింది. బజాజ్ కుటుంబం 27 శాతం ఎక్కువగా రూ. 446 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది.
వ్యక్తులు తగ్గి... విరాళం పెరిగి
హురున్ ఇండియా తాజా జాబితాలో ఈసారి మొత్తం 191 మంది చోటు దక్కించుకున్నారు. నిరుడు 203 మందికి స్థానం లభించింది. అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ.43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది.
మనం ప్రపంచానికే ఆదర్శం!
చైనాతో పోలిస్తే ఇండియా ఎక్కువ దాతృత్వ గుణం కలిగి ఉందని హురూన్ నివేదిక పేర్కొంది. చైనా జీడీపీ దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది.
టాప్ –10 దాన కర్ణులు
1 శివ్ నాడార్ రూ.2,708 కోట్లు విరాళాల
రంగాలు: విద్య, కళలు, సామాజిక అభివృద్ధి
2 ముకేశ్ అంబానీ రూ.626 కోట్లు
రంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి
3 బజాజ్ రూ.446 కోట్లు రంగాలు: గ్రామీణాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు
4 కుమార మంగళం బిర్లా రూ.440 కోట్లు
రంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య
5 గౌతమ్ అదానీ రూ.386 కోట్లు
రంగాలు: విద్య, నైపుణ్యాభివృద్ధి
6 నందన్ నీలేకని రూ.365 కోట్లు
రంగాలు: ప్రజారోగ్యం, డిజిటల్ డెవలప్‌మెంట్
7 హిందూజా రూ.298 కోట్లు
రంగాలు: ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్యం
8 రోహిణీ నీలేకని రూ.204 కోట్లు
రంగాలు: పర్యావరణం, పాలన, సామాజిక సమానత్వం
9 సుధీర్–సమీర్ మెహతా రూ.189 కోట్లు
రంగాలు: సామాజిక అభివృద్ధి
10 సైరస్ పూనావాలా రూ.183 కోట్లు
రంగాలు: బడుల్లో మౌలిక సదుపాయాలు


