
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాక్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా బాగ్‌లిహార్ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. పాక్‌ను ఎండగట్టే చర్యల్లో భాగంగా ఇది రెండో ప్రతీకార చర్యగా చెప్పుకోవచ్చు.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు భారత్ వరుస షాక్‌లిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్‌లిహార్ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది.
ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్‌కు తెలియజేసినట్లైందన్నారు. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, సింధు జలాల ఒప్పందం కింద పాక్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ డ్యామ్‌ను చీనాబ్ నదిపై 2008లో నిర్మించారు.
ఇక, పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యామ్ నుంచి పాకిస్తాన్‌కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్‌లోని సియాల్ కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్‌లోని పంజాబ్‌లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇలా తరచూ నిర్ణయాలు తీసుకుంటూ పాక్‌కు భారత్‌కు చుక్కలు చూపిస్తోంది.