రోజులో 1.45 లక్షల కేసులు

India reports 1,45,384 new Covid cases - Sakshi

10 లక్షల మార్క్‌ దాటిన యాక్టివ్‌ కేసులు 

794 మంది కరోనాకి బలి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశానికి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఏ రోజుకారోజు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత 24 గంటల్లో 1,45,384 కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926కి చేరుకుంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ దాటేసింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,46,631కి చేరుకుంది. మొత్తం కేసుల్లో 7.93% యాక్టివ్‌ కేసులున్నాయి. ఆరున్నర నెలల తర్వాత క్రియాశీల కేసులు అత్యధిక స్థాయికి మళ్లీ చేరుకున్నాయి. ఇక కరోనాతో ఒకే రోజు 794 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1, 68,436కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌ 18 తర్వాత కోవిడ్‌తో ఇంత మంది మృత్యువాత పడడం ఇదే తొలిసారి.  

► ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. గత నెల రోజుల్లోనే రోజువారీ సగటు కేసులు 15 రెట్లు పెరిగిపోయాయి. యాక్టివ్‌ కేసులు ఆరు రెట్లు పెరిగిపోవడం ఆందోళన పుట్టిస్తోంది. 24 గంటల్లో 3,468 కేసులు నమోదయ్యాయి.  
► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్‌ బాధితులు ఎక్కువై పోతూ ఉండడంతో ఆక్సిజన్‌ కోసం డిమాండ్‌ అమాంతం 60% పెరిగిపోయింది. రాష్ట్రంలో ఈ నెలాఖరికి కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్‌ సహా పలు నగరాల్లో లాక్‌డౌన్‌ని ఈ నెల 19 వరకు పొడిగించారు.  
►  రాజస్తాన్‌లోని తొమ్మిది నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల
వరకు కర్ఫ్యూ ఉంటుంది.  
► ఢిల్లీలో ఒకే రోజు 8 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. అయితే దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ విధించడం సరైన పని కాదని సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. దానికి బదులుగా ఆంక్షల్ని మరింత కఠినతరం చేస్తూ, అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడమే కరోనా కట్టడికి మార్గమని కేజ్రివాల్‌ అభిప్రాయపడ్డారు.  
► మహారాష్ట్రలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభం కావడంతో నగరాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ జనసమ్మర్ధంతో కిటకిటలాడే ముంబై, పుణె, నాగపూర్‌ వీధులన్నీ బోసిపోయి కనిపించాయి.  
► కర్ణాటకలోని ప్రధాన నగరాల్లో శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ మొదలైంది.

మోహన్‌ భాగవత్‌కి పాజిటివ్‌
ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందరిలోనూ కనిపించే సాధారణ లక్షణాలే ఆయనలోనూ ఉన్నాయని ఆరెస్సెస్‌ తన అధికారికి ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. భగవత్‌ని చికిత్స నిమిత్తం శనివారం నాడు నాగపూర్‌లోని కింగ్స్‌వే ఆస్పత్రికి తరలించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top