దేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ.
గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి
దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్‌లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రుతుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది.
భారీ లోటు వర్షపాతం...
ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది.
ఎల్‌నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్‌కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్‌ను అడ్డుకోవడం తదితర వాతావరణ పరిస్థితులు ఏకమవడంతో రుతుపవనాలు స్తంభించిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
315 జిల్లాలు ప్రభావితం
దేశంలో మొత్తం 724 జిల్లాల్లో ఏకంగా 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’ జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’ సిద్ధం చేశారు. అక్కడ తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం, విత్తనాల మార్పిడి వంటి వ్యూహాలను అమలుచేయనున్నారు.


