సరిహద్దుల్లో శాంతి కపోతాలు..!

India, China Disengage In Gogra In Eastern Ladakh - Sakshi

గోగ్రా వద్ద ఇండో, చైనా బలగాల ఉపసంహరణ

తాత్కాలిక కట్టడాల కూల్చివేత

న్యూఢిల్లీ: దాదాపు 15నెలల ఉద్రిక్తతల అనంతరం తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా వద్ద ఇండియా, చైనాలు తమతమ బలగాల ఉపసంహరణను పూర్తి చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారేందుకు, శాంతి నెలకొనేందుకు వీలు కలగనుంది. ఈ ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ఆగస్టు 4,5 తేదీల్లో పూర్తయిందని, అంతేకాకుండా ఇరుపక్కలా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడం జరిగిందని భారత ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. బలగాల ఉపసంహరణ, కట్టడాల నిర్మూలనను ఇరుపక్షాలు పరస్పరం నిర్ధారించుకున్నాయని తెలిపింది.

పాంగాంగ్‌ సరస్సుకు ఇరుపక్కలా బలగాలను, ఆయుధాలను ఇండియా, చైనా ఉపసంహరించుకున్న ఐదునెలల అనంతరం గోగ్రా ఏరియా(పెట్రోలింగ్‌ పాయింట్‌ 17ఏ– పీపీ 17ఏ) వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. ఇరు దేశాల మిలటరీ అధికారుల నడుమ జరిగిన 12వ దఫా చర్చల్లో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఉపసంహరణ చేసినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు వెంట కొంత ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా ప్రకటించుకోవాలని, ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ జరగకూడదని ఇరుదేశాల మిలటరీ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో మరింత శాంతి నెలకొనేందుకు త్వరలో జరిగే మిలటరీ చర్చల్లో ప్రాధాన్యమివ్వాలని సైతం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.  

ఏడాది పైగా ఉద్రిక్తతలు
గతేడాది మేలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో ఉద్రికత్తలు ఆరంభమయ్యాయి. అనంతరం ఇరు పక్షాలు వేలాదిగా బలగాలను ఎల్‌ఏసీ ప్రాంతాలకు తరలించాయి. అనంతరం ఇండో చైనా విదేశాంగ మంత్రులు, సైనికాధికారుల మధ్య చర్చలతో వివాదం క్రమంగా కరిగిపోతూ వస్తోంది. తాజాగా గోగ్రా ఏరియాలో ప్రస్తుత బలగాలను ఉపసంహరించడంతో పాటు కొత్తగా బలగాలను మోహరించకూడదని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆర్మీ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఇరుదేశాల సైనికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని పేర్కొంది. దీంతో మరో సున్నితమైన ప్రాంతంలో దిగ్విజయంగా శాంతిస్థాపన జరిగిందని, ఇకపై ఇదే ధోరణితో ముందుకెళ్లాలని, ఇతర వివాదాస్పద అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాల సైన్యం నిర్ణయించుకుందని తెలిపింది.

నిజానికి గతేడాదిలోనే ఈ ప్రాంతాల్లో ఇరుపక్షాలు కొంతమేర బలగాల ఉపసంహరణ చేపట్టినా పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఉపసంహరణ పూర్తిస్థాయిలో జరగలేదు. కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఎల్‌ఏసీ(లైన్‌ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌)ను పూర్తిగా గౌరవించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. ఇదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణకు, ఎల్‌ఏసీ వద్ద శాంతి నెలకొల్పేందుకు ఆర్మీ ధృఢనిశ్చయంతో ఉందని తెలిపింది. గోగ్రా ఏరియాలో శాంతి నెలకొనడంతో ఇకపై హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, డెమ్‌చాక్‌ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉంది. ఇరు దేశాల బంధానికి ఈ ప్రాంతాల్లో వివాద పరిష్కారమే మార్గమని భారత్‌ చెబుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top