
22 సింగిల్–సీటర్ జెట్లు, 4 ట్విన్–సీటర్ జెట్లు
ప్రతిపాదనకు సెక్యూరిటీ కేబినెట్ కమిటీ ఆమోదం
ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు త్వరలో ఒప్పందం విలువ రూ. 63 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నావికాదళాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ రూ.63,000 కోట్లు. ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
26 ఫైటర్ జెట్లలో 22 సింగిల్–సీటర్ జెట్లు, 4 ట్విన్–సీటర్ జెట్లు ఉన్నాయి. భారత నావికా దళానికి ఈ యుద్ధ విమానాలు సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సరఫరా, సిబ్బందికి శిక్షణ కూడా ఒప్పందంలో భాగమే. కీలకమైన ఈ డీల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెక్యూరిటీ కేబినెట్ కమిటీ బుధవారం ఆమోద ముద్ర వేసింది.
26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల అప్పగింత ప్రక్రియ రాబోయే ఆరేళ్లలో పూర్తి కానుంది. మొదటి బ్యాచ్ యుద్ధవిమానాలు 2029లో ఫ్రాన్స్ నుంచి భారత నేవీకి అందుతాయి. 2031 నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్యే ఒప్పందం కుదరనుంది. విమానాల అప్పగింత, వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు.
సముద్ర గగనతలంపై పట్టు
రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్–29కే యుద్ధ విమానాలు భారత నావికా దళానికి సేవలందిస్తున్నాయి. వీటి స్థానంలో రఫేల్ ఫైటర్ జెట్లను దశలవారీగా ప్రవేశపెట్టబోతున్నారు. భారత విమాన వాహక నౌకలైన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తారు. అత్యాధునిక ఎల్రక్టానిక్, ఆయుధ వ్యవస్థతో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై భారత నావికాదళం పట్టు మరింత పెరుగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకొనే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది.