History Of Manipur In Telugu, What Are The Reasons Behind Kuki And Meitei Conflict - Sakshi
Sakshi News home page

Manipur History In Telugu: అగ్ని గుండంగా రాష్ట్రం.. ఇదీ మణిపూర్‌ కథ..!

Published Wed, Aug 9 2023 1:38 AM

The history of Manipur has raised the interest of all - Sakshi

మణిపూర్‌ చరిత్ర అంటే రాజులు, సంస్థానాలు, ఆక్రమణలు, చొరబాట్లు మాత్రమే కాదు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జాతుల కలబోత. విభిన్న తెగల వారు ఒకే చోట సహజీవనం చేసే మణిహారం. మెయిటీలు, కుకీల మధ్య మూడు నెలలుగా జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌ చరిత్ర అందరిలోనూ ఆసక్తిని పెంచింది.  

మణిపూర్‌ లోయ ప్రాంతంలో మెయిటీలు, నాగా, జొమి ఇలా 124 తెగలు నివసిస్తూ ఉంటే మణిపూర్‌ కొండల్లో 38 గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కుకీల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గాల మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో మెయిటీలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి.  

చరిత్రలోకి తొంగి చూస్తే  
మణిపూర్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాలు క్రీ.శ. 33వ సంవత్సరం నుంచి ఉన్నాయి. అయితే, అంతకు ముందు సైతం ఇంఫాల్‌ లోయలో మానవ నాగరికత వెల్లివిరిసినప్పటికీ అక్కడ ఉన్న వారంతా మెయిటీ వర్గీయులు అని చెప్పడానికి వీల్లేదు. టిబెట్, బర్మా నుంచి మెయిటీలు వలస వచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన నింగ్‌డౌ వంశీకులు మణిపూర్‌ లోయను పాలించారు.

మణిపూర్‌ రాజులు, ప్రజలు 18 వ శతాబ్దం వరకు సనామహిజం అనే దేశీయ మత విశ్వాసాల్ని ఆచరించారు. 15వ శతాబ్దంలో లోయను పాలించిన క్యంబ అనే రాజు విష్ణమూర్తి దేవాలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి లోయలోకి బ్రాహ్మణుల రాక ప్రారంభమైంది. అప్పట్లోనే మణిపూర్‌ లోయను పాలించిన రాజులు హిందువులుగా మారారా అన్న చర్చ ఉంది.

అయితే 1704వ సంవత్సరంలో రాజు చరియారోంగ్బా తన కుటుంబంతో సహా హిందూమతంలోకి మారారు. అప్పట్నుంచి ఇంఫాల్‌ లోయలో హిందువుల ప్రాబల్యం పెరిగింది. నింగ్‌డౌ వంశీకులే 1724లో ఈ ప్రాంతానికి మణిపూర్‌ (మణిమాణిక్యాలకు నిలయం) అని పేరు పెట్టారు.  

కుకీల ప్రస్తావన తొలిసారి ఎప్పుడంటే  
కొన్ని వందల శతాబ్దాల కిందటే మణిపూర్‌ లోయ ప్రాంతంలో మెయిటీల ఉనికి ఉంది. కానీ కుకీల ప్రస్తావన 17వ శతాబ్దంలో తొలిసారిగా తెలిసింది. 1777లో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వారెన్‌ హేస్టింగ్స్‌ ఉన్నప్పుడు చిట్టగాంగ్‌లో బ్రిటీషర్లపై ఒక తెగ దాడి సందర్భంగా తొలిసారిగా కుకీల ప్రస్తావన వినిపించింది.

బ్రిటీష్‌ రచనల్లో కుకీలను పాత కుకీలు, కొత్త కుకీలుగా విభజించారు. ఆంగ్లో, బర్మా యుద్ధం (1824–1826) జరిగినప్పుడు బర్మా నుంచి వచ్చినవారే కొత్త కుకీలు అని బ్రిటీష్‌ రచనల ద్వారా తెలుస్తోందని రచయిత, చరిత్రకారుడు మలేమ్‌ నింగ్‌తౌజ వెల్లడించారు.

అప్పట్నుంచే మెయిటీల డిమాండ్‌  
1819లో మణిపూర్‌పై బర్మా దురాక్రమణకు దిగింది. దీంతో మణిపూర్‌ రాజులు బ్రిటీష్‌ సాయం కోరారు. అప్పట్నుంచి 1891 వరకు మణిపూర్‌ తెల్లదొరల సంరక్షణలో ఉంది. తర్వాత సంస్థానా«దీశుల చేతికొచ్చింది. సంస్థాలన్నీ భారత్‌లో విలీనమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత 1949 సంవత్సరం అక్టోబర్‌ 15  నుంచి మణిపూర్‌ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైంది. ఆ సమయంలో మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న చర్చ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

కుకీలకు తెల్లదొరల అండ 
బ్రిటిష్‌ పాలకుల అండదండలతో కుకీలు మణిపూర్‌ కొండప్రాంతాల్లో స్థిరపడ్డారు. నాగా తెగల దాడుల నుంచి లోయ ప్రాంతాలను రక్షించే పనిలో ఉండేవారు. ఓ రకంగా బ్రిటీష్‌ పాలకుల కిరాయి సైన్యంగా పని చేసేవారు. తెల్లదొరలు తమ వ్యూహంలో భాగంగా ఒక తెగకి వ్యతిరేకంగా మరో తెగని, వారికి వ్యతిరేకంగా ఇంకో తెగవారిని ప్రోత్సహించారు. కొండ ప్రాంతాల్లో కుకీల ప్రాబల్యం పెరిగిపోవడానికి బ్రిటీష్‌ వారి వ్యూహాలే కారణమని మలేమ్‌ నింగ్‌తౌజ అభిప్రాయపడ్డారు. 

నేటి ఘర్షణలకు మూలం 
మణిపూర్‌ ఘర్షణలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. లోయ ప్రాంతాల్లో నివసించే మెయిటీలు ఎస్‌టీ హోదా కోసం డిమాండ్‌ చేస్తూ ఉంటే కొండప్రాంతంలో ఎస్టీ హోదా ఉన్న కుకీలు తమకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. 1949 తర్వాత మయన్మార్‌ నుంచి అక్రమ వలసదారులు భారీగా వచ్చి కుకీ సమాజంలో కలిసిపోయారని అదే నేటి ఘర్షణలకు మూలమని రచయిత, చరిత్రకారుడు నింగ్‌తౌజ తెలిపారు. మణిపూర్‌ చరిత్రతో నేటి ఘర్షణలకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు.

రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్న అక్రమ వలసదారుల్ని ఏరివేయడానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకీలలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రదర్శన నిర్వహిస్తూ 1951 తర్వాత అక్రమంగా వచ్చిన వలసదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేయాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యలు, సవాళ్లతోనే మణిపూర్‌ జాతుల సంఘర్షణ సంక్లిష్టంగా మారింది.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement