హిమాచల్‌ ఘటన: లేడీ డాక్టర్‌ చివరి ట్విటర్‌ పోస్టు వైరల్‌

Himachal Pradesh Landslide Doctor Last Post Viral - Sakshi

న్యూఢిల్లీ : ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ...’ ఇదో సినిమా పాట అయినా 100 శాతం వాస్తవం కూడా.. జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. నిమిషాల్లో జీవితం తలకిందులు కావచ్చు, లేదా ముగిసిపోవచ్చు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాధిస్తూ.. ఆనందిస్తూ.. ఎవ్వరినీ కష్టపెట్టకుండా.. మనం కష్టపడకుండా ముందుకు సాగాలి. పక్కనోళ్లను ఆలోచింపజేయాలి. ఈ ప్రయాణంలో ప్రాణాలు విడిచినా.. మన కారణంగా కొంతమందైనా జీవితానికి నిజమైన అర్థం తెలుసుకుంటే అదో ‘ఆత్మ’ సంతృప్తి. ఈ నాలుగు లైన్ల ఇంట్రో పరమార్థం ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం చాలా చిన్నది దాన్ని ప్రతీక్షణం ఆస్వాధించాలి. ఎలా అంటే జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ దీప లాగా. ఆమె తన జీవితపు చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాధించింది.. ప్రకృతి ఒడిలో కాలం గడిపింది.. ప్రాణాలు విడిచింది.

ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌.. కన్నౌవ్‌ జిల్లాలో సంగాల్‌ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన 9 మందిలో ఆమె కూడా ఒకరు. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్‌ బార్డర్‌ వద్ద దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో ఆమె షేర్‌ చేశారు. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్‌ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడ్డాయి. ఓ కారులో ఉన్న దీప మృత్యువాతపడింది. ఓ ప్రకృతి ప్రేమికురాలి జీవితం ముగిసింది. ప్రస్తుతం ఆమె చివరి ట్విటర్‌ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమ షాక్‌ను.. సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top