Sakshi News home page

వీడియో: కాబోయేవాడు కన్నుమూసిన బాధను దిగమింగుకుని..

Published Wed, Dec 27 2023 9:05 AM

Heartbreaking Visuals Of Woman Next To UP Cop Body - Sakshi

ఇద్దరిదీ ఒకే డిపార్ట్‌మెంట్‌. వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కానీ, విధి వక్రచూపు చూసింది. ఊహించని ఘటన.. ఆ ఇద్దరినీ ఒక్కటి కాకుండా చేసింది. ఇక తిరిగి రాడని తెలిసినా.. అతని కుటుంబాన్ని ఓదార్చడం కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. మృతదేహం పక్కనే మౌనంగా కూర్చుండిపోయింది. అయితే.. అంతిమ సంస్కారాలకు వెళ్లే సమయంలో బోరున విలపిస్తూ కనిపించిందామె. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. బుల్లెట్‌ గాయాలతో చికిత్స పొందుతూ సదరు కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది.

పోలీస్ కానిస్టేబుల్ సచిన్ రాఠీ(30), మరో ముగ్గురు పోలీసులతో కలిసి సోమవారం అశోక్ యాదవ్(52) అనే నేరస్థుడిని పట్టుకోవడానికి తన టీంతో వెళ్లాడు. కన్నౌజ్‌లోని నిందితుడి ఇంటి వద్దకు చేరుకోగానే.. పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో సచిన్ రాఠీ తొడపై బుల్లెట్‌ దిగింది. అయినా సచిన్‌ తగ్గలేదు. రక్తమోడుతున్నా.. నిందితుల కోసం గంట సేపు పోరాటం జరిపాడు. కొద్దిసేపటికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితులు అశోక్ యాదవ్, అభయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే..

ఈ కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ సచిన్ రాఠిని లక్నోలోని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువ పోలీసు చాలా రక్తాన్ని కోల్పోయాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు.

ముజఫర్‌నగర్‌కు చెందిన సచిన్ రాఠి 2019లో పోలీసు శాఖలో చేరారు. కోమల్‌ దేస్వాల్‌తో కానిస్టేబుల్‌. ఇద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 5న సచిన్‌-కోమల్‌ వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలకు సిద్ధమవ్వాల్సిన వారి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. 

కన్నౌజ్‌ నుంచి సచిన్‌ తండ్రి, అతని మేనమామ మృతదేహం తీసుకొచ్చారు.  విగత జీవిగా ఉన్న సచిన్‌ను ఆమె బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. గౌరవ వందనం కోసం పోలీస్‌ లేన్‌లో సచిన్‌ పార్థీవ దేహం ఉంచారు. ఆ సమయంలో తన బాధను దిగమింగుకుంటూ.. సచిన్‌ తల్లిదండ్రుల్ని కోమల్‌ ఓదారుస్తూ కనిపించింది. ఆఖరి క్షణాల్లో మాత్రం గుండెలు అవిసెలా రోదించడం పలువుర్ని కలచివేసింది. 

ఉత్తర ప్రదేశ్‌లో 2017 నుంచి యోగి సర్కార్‌ అధికారం చేపట్టాక 11 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. సచిన్‌తో కలిపి ఇప్పటిదాకా 16 మంది పోలీస్‌ సిబ్బంది చనిపోయారు. సుమారు 1,500 మంది గాయపడ్డారు.

Advertisement

What’s your opinion

Advertisement