
బీపీఎఫ్ నేతకు ప్రధాని మోదీ అభినందనలు
కొక్రాఝర్: అసోం రాష్ట్రంలోని బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్(సీఈఎం)గా హగ్రమ మొహిలరీ ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఈఎంగా మాజీ మంత్రి రిహొన్ డైమరీ కూడా ప్రమాణం చేశారు. కొక్రాఝర్‌లోని బోడోల్యాండ్ సెక్రటేరియట్ ఫీల్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటా ప్రమాణం చేయించారు.
గవర్నర్ ఎల్పీ ఆచార్య, సీఎం హిమంత బిశ్వ శర్మ, పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మొహిలరీ ఈ పదవీ బాధ్యతలను చేపట్టడం ఇది నాలుగోసారి. సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 40 సీట్లకుగాను 28 సీట్లను సొంతం చేసుకుంది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్) బీజేపీలు కలిసి ఏడింటిని, ఇతరులు ఐదు సీట్లను గెలుచుకున్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు కొత్తగా ఎన్నికైన బీపీఎఫ్ సభ్యులు డోట్మాలోని బోడో నేత బొడొఫా ఉపేందన్రాథ్ బ్రహ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 2020 జనవరి 27వ తేదీన ఢిల్లీలో జరిగిన తాజా బోడో ఒప్పందం అనంతరం జరిగిన రెండో ఎన్నికలివి. మొదటి దఫా ఎన్నికల్లో బీపీఎఫ్ 17 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది.
అయితే, గణ సురక్ష పరిషత్, బీజేపీ, యూపీపీఎల్ కలిసి బోడో కౌన్సిల్ ఏర్పాటు చేశాయి. కాగా, అసోం బోడోల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ చీఫ్‌గా ప్రమాణం చేసిన హగ్రమ మొహిలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రం, అసోం ప్రభుత్వం బీటీసీ కౌన్సిల్‌కు పూర్తి మద్దతు కొనసాగిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.
బీటీసీ ఏం చేస్తుందంటే..
కొక్రాఝర్, చిరంగ్, బక్సా, ఉదల్‌గిరి, తముల్పూర్ జిల్లాలను కలిపి ఏర్పాటైందే బీటీసీ. సుమారు 9 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించిన ఉన్న బోడోలు మెజారిటీగా కలిగిన ఈ ప్రాంతంపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను బీటీసీ కలిగి ఉంటుంది. 1993లో జరిగిన ఒప్పందం ప్రకారం, బోడోలాండ్ భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన పరిపాలనా విభాగం.