200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు | Sakshi
Sakshi News home page

200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు

Published Mon, Apr 15 2024 3:45 PM

Gujarat Jain Couple Donated Nearly Rs 200 Crore And Adopted Monkhood - Sakshi

గాంధీ నగర్‌ : వాళ్లిద్దరూ భార్యభర్తలు. వ్యాపార సామ్రాజ్యం. వందల కోట్లలో ఆస్తులు. సమాజంలో బోలెడంత పలుకుబడి. కానీ పైవేవి వాళ్లిద్దరికి సంతృప్తినివ్వలేదు. అందుకే ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కుబేరుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

గుజరాత్‌ సబర్‌కాంత జిల్లా వాసి భావేష్ భండారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం ఊపందుకుంది. ఊహించనంత లాభాల్ని కళ్ల జూశారు. ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. కానీ ఈ ఆస్తి పాస్తులు, వ్యాపారం ఆ దంపతులకు ఏ మాత్రం సంతృప్తి నివ్వలేదు.

పిల్లల బాటలో తల్లిదం‍డ్రులు
చివరికి భావేష్‌ బండారి దంపతులిద్దరి 19 ఏళ్ల కుమార్తె , 16 ఏళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పిల్లలిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్‌ బండారి దంపతులు.. తమ పిల్లలులాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 

200 కోట్లు విరాళం

సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతని భార్య తమ సంపద రూ.200 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు.   

చెప్పులు లేకుండా 
భండారీ దంపతులు, మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలు దేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేయనున్నారు. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశం అంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు.

Advertisement
 
Advertisement