
న్యూఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో ఉపశమనం కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయినట్లు కనిపిస్తున్నాయి. కేరళకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆమెను కాపాడటానికి దౌత్య ప్రయత్నాలు చేయాలంటూ కేంద్రానికి మెరపెట్టుకున్నాయి.
2017లో నిమిషా ప్రియ తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ నుంచి తన ధృవీకరణ పత్రాలను తిరిగి పొందేందుకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చిందని, ఫలితంగా అతను మృతి చెందాడనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెపై మోపిన అభియోగాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే ఆమెకు ఉపశమనం కల్పించేందుకు చేసిన చట్టపరమైన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జూలై 16న యెమెన్‌లో ఆమెకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిమిషా ప్రియ తన వ్యాపార భాగస్వామి మెహదీని హత్య చేసి, మరొక నర్సు సహాయంతో అతని శరీరాన్ని ముక్కలు చేసి, ఆ భాగాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసిందని యెమెన్ కోర్టు నిర్ధారించింది. ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెను అరెస్టు చేశారు. సనాలోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. దీనిని ఆమె యెమెన్‌లోని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. అయితే ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె అధ్యక్షునికి క్షమాభిక్ష కోసం విజ్ఞప్తి చేసింది. అయితే ఆయన అందుకు నిరాకరించారని సమాచారం.
ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. యమన్‌లో ఉరిశిక్ష పడిన భారత నర్సును కాపాడేందుకు అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 14న విచారించనుంది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది.