10,574.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జైల్లలో శిక్ష అనుభవిస్తున్న భారతీయుల సంఖ్య. అందులో 43 మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నారు. యెమెన్‌లో మలయాళీ నర్సు నిమిషా ప్రియ, గల్ఫ్ దేశాల్లో మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు.
అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం భారత్ నుంచి ఒకే ఒక్కరు మరణ శిక్ష ఎదుర్కొటున్నారు. అతడే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘునందన్ యందమూరి. ఈ నేపథ్యంలో అతడు శిక్ష అనుభవిస్తున్న కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రఘునందన్ యందమూరి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. హెచ్1బీ వీసాతో అమెరికాకు వెళ్లాడు. అయితే పెన్సిల్వేనియాలో నివాసముండే రఘునందన్.. అక్టోబర్ 20, 2012న తన భార్యతో కలిసి ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అక్కడే 10 నెలల చిన్నారి సాన్వి వెన్న ధరించిన బంగారు ఆభరణాల గురుంచి ఆమె తల్లి ఇతరులతో చెబుతుండడం రఘునందన్ విన్నాడు.
అప్పటికే క్యాసినోలో దాదాపు 15,000 డాలర్లు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రఘునందన్ కన్ను ఆ బంగారు నగలపై పడింది. తన అప్పు తీర్చడానికి ఆ చిన్నారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. రెండు రోజుల తర్వాత సాన్విని కిడ్నాప్ చేసే క్రమంలో రఘునందన్ అడ్డువచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతి (61) ని అత్యంత దారుణంగా హత్య చేశాడు.
అనంతరం సాన్విని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అయితే ఏడవకుండా నోటిలో గుడ్డలు కుక్కి, టేపు వేయడంతో ఊపిరాడక ఆ పసికందు కూడా ప్రాణాలు విడిచింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రఘునంద్‌ను దోషిగా తెలుస్తూ 2014లో పెన్సిల్వేనియా కోర్టు మరణశిక్ష విధించింది.
అయితే తొలుత హత్య చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, కేవలం దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్ ముందు వాగ్మూలం ఇచ్చాడు.
దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసును బదిలీఅయ్యింది. ఈ కేసును విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం కూడా అతడిని దోషిగా తెలుస్తూ.. మరణ శిక్షణను సమర్ధించింది. అయితే పెన్సిల్వేనియా రాష్ట్రంలో 1999 నుండి మరణశిక్ష అమలుపై తాత్కాలిక నిషేధం ఉంది. దీంతో రఘునందన్ ప్రస్తుతం జైలులోనే మరణశిక్ష అమలు కోసం ఎదుచూస్తున్నాడు.


