కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల వినతి
సీఎంఆర్ సరఫరా గడువును పొడిగించాలని కోరుతూ లేఖ
కేంద్రం తక్కువ లక్ష్యాలతో రాష్ట్రంపై రూ.16,446 కోట్ల అదనపు భారం
రైతుల నుంచి ప్రతి గింజనూ ఎంఎస్‌పీకే కొంటాం: ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తున్న నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన సేకరణ లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదేవిధంగా కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషితో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలంటూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేస్తోందన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ : దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించిందని, ఈ కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఉత్తమ్ తెలిపారు. ఖరీఫ్, రబీ కలిపి 2025–26 మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణలో 152 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి సేకరణ జరిగి చరిత్రాత్మక రికార్డు నమోదైందన్నారు.
రబీ 2025–26 సీజన్‌కు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాలను రాష్ట్రం సమర్పించగా, కేంద్రం కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (51.47 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. గత మూడు సీజన్లలో కేంద్రం లక్ష్యాలకు మించి రాష్ట్రం 69.50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల రూ.16,446 కోట్ల అదనపు భారం పడిందన్నారు.
సీఎంఆర్ గడువు పొడిగించాలి
నిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాల వల్ల సీఎంఆర్ సరఫరాలో గడువులను పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రల్హాద్ జోషికి ఉత్తమ్ వివరించారు. రబీ 2024–25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025–26 గడువును 120 రోజులు పొడిగించాలని కోరారు. రబీ 2025–26 సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి పెంచాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
రబీ వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని, వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు.


