కశ్మీర్‌ పార్టీల మల్లగుల్లాలు

Freedom Incomplete Without Release Of Omar, Meh - Sakshi

ముఫ్తీదే తుది నిర్ణయమన్న పీడీపీ 

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలతో ఫరూక్‌ అబ్దుల్లా చర్చలు 

రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌  

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో కశ్మీర్‌కు చెందిన పార్టీలన్నీ ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా పార్టీలో అంతర్గత చర్చలు ప్రారంభించారు. చర్చల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుందామనే విషయంలో సీనియర్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ‘‘ఎన్‌సీ చీఫ్‌ పార్టీ సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి అలీ మహమ్మద్‌ సాగర్, కశ్మీర్‌ ప్రావిన్షియల్‌ అధ్యక్షుడు నసీర్‌ అస్లామ్‌ వణీతో చర్చించారు.

ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై స్పష్టత వస్తుంది’’అని పార్టీ నాయకుడొకరు ఆదివారం వెల్లడించారు. కశ్మీర్‌లో మరో ప్రధాన పార్టీ పీడీపీకి చెందిన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశమై నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కట్టబెట్టింది. ‘‘అఖిలపక్ష సమావేశంపై తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి ముఫ్తీకి కట్టబెడుతూ పీఏసీ నిర్ణయించింది’’అని పీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ సుహైల్‌ బుఖారి చెప్పారు. పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) మంగళవారం సమావేశమై అసలు సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని నిర్ణయిస్తారు. కశ్మీర్‌ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 24, గురువారం మధ్యాహ్నం 3 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: కాంగ్రెస్‌
ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదాని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అయితే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారో లేదో కాంగ్రెస్‌ స్పష్టంగా వెల్లడించలేదు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌కే తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top