
యువత, రైతులు, మత్స్యకారులు, పరిశ్రమలకు లబ్ధి
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
తమిళనాడులో రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం
సాక్షి, చెన్నై: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని, దీనివల్ల మన దేశానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ పట్ల ప్రపంచదేశాలకు పెరుగుతున్న విశ్వాసానికి, గౌరవానికి ఈ ఒప్పందమే ఒక నిదర్శనమని వివరించారు. ఎఫ్‌టీఏతో వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు.
ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించారు. ఎయిర్‌పోర్ట్, రహదారులు, రైల్వే, విద్యుత్‌కు సంబంధించిన రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. తమిళనాడు సంప్రదాయ వ్రస్తాలు ధరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి సంబంధించిన 99 శాతం ఉత్పత్తులపై బ్రిటన్‌లో ఇక పన్నులు ఉండవని అన్నారు.
ఇండియా ఉత్పత్తుల ధరలు తగ్గితే సహజంగానే డిమాండ్ పెరుగుతుందని, దానివల్ల మన దేశంలో వాటి ఉత్పత్తిని పెంచాల్సి వస్తుందని వెల్లడించారు. ఫలితంగా మన యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల లభిస్తాయని, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్‌లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా తమిళనాడులో అడుగుపెట్టడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధనం చాలా ముఖ్యమని చెప్పారు. గత 11 ఏళ్లుగా ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.
మన ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టాం
‘మేక్ ఇన్ ఇండియా’ఆయుధాలు ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయని, శత్రు శిబిరాలను ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మన స్వదేశీ ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టామని, వారికి నిద్రలేకుండా చేశామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో వంతెనలు, సొరంగాలు నిర్మించామని, దీనివల్ల వేలాది ఉద్యోగాల సృష్టి జరిగిందని, యువత లబ్ధి పొందారని స్పష్టంచేశారు. చెన్నైలోని ప్రఖ్యాత వళ్లువర్ కోట్టం రథం నమూనాను తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రధాని మోదీకి బహూకరించారు.