చర్ల: ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం పరిధిలోని కందాలపర్తి, సక్మెట్ట గ్రామాల సమీపంలో మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పాపారావు, డీవీసీఎం మెంబర్ దిలీప్‌తోపాటు 100 మందికిపైగా మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్ జిల్లాకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ విభాగాల బలగాలు శుక్రవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టాయి.
శనివారం ఉదయం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు మొదలుపెట్టగా బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తొలుత డివిజనల్ కమిటీ సభ్యుడు దిలీప్ బెడ్జాతోపాటు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు కోసా మడివి మృతిచెందారు. మరికొందరు గాయపడ్డప్పటికీ తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో ఒక ఏకే 47తోపాటు పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటన నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకోవడంతో వారి కోసం అదనపు బలగాలతో కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో బలగాలు జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉండగా వారిని గుర్తించాల్సి ఉందని ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు.


