
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న భాషా వివాదంపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి, మరాఠీలో మాట్లాడమంటూ ఆ భాష రానివారిపై దాడి చేస్తే, వారు వెంటనే మరాఠీలో మాట్లాడగలుగుతానా?.. అలా చేస్తే అది మహారాష్ట్రకే హాని కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
తమిళనాడులో తాను ఉన్న సమయంలో ఇలాంటి భాషా వివాదాన్ని చూశానని తెలిపారు. ఒకరోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తాను కారులో ప్రయాణిస్తుండగా, రోడ్డు పక్కన ఒక వ్యక్తిపై పలువురు దాడి చేయడాన్ని తాను చూశానన్నారు. తరువాత తాను జోక్యం చేసుకుని, ఆరా తీయగా, బాధితుడు ఉత్తర భారతదేశానికి చెందిన లారీ డ్రైవర్ అని తెలిసిందన్నారు. అతను హిందీలో మాత్రమే మాట్లాడగలడని, అయితే దాడి చేసిన వారు అతనిని తమిళంలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని తెలుసుకున్నానన్నారు.
భాషపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ప్రమాదకరమని గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలను విభజించడమే కాకుండా ఇతరులు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, భాష ఎప్పుడూ హింస లేదా వివక్షకు కారణం కాకూడదని గవర్నర్ పేర్కొన్నారు.
మనం మాతృభాషను చూసి గర్వపడుతూనే ఇతర బాషలను కూడా నేర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలను సమర్ధించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ ‘మరాఠీ మన మాతృభాష. అది మనకు గర్వకారణం. అయితే ఎవరైనా మరాఠీలో మాట్లాడాలని బలవంతం చేయడం లేదా వారిపై దాడి చేయడం సరైనది కాదు. మనం కూడా మహారాష్ట్రను దాటి ఎప్పుడైనా బయటకు వెళతాం. అక్కడ ఎవరైనా తమిళం లేదా బెంగాలీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తే మనం ఏం చేయగలం? అని ప్రశ్నించారు. అన్ని భాషలను గౌరవించాలని గిరీష్ మహాజన్ అన్నారు.