చైబాసా: జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ 10 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, గత ఆదివారం(జనవరి 18వ తేదీ) ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. అంతకుముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం చెప్పినట్లుగానే.. ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో ఎన్‌కౌంటర్‌లు కూడా కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.


