
రైతుల కోసం ఆర్థిక భారం మోస్తున్న ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలపై ఎరువుల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రాయితీ చెల్లించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆగస్టు 7వ తేదీ వరకు ఎరువుల తయారీదారులు, దిగుమతిదారులకు రాయితీ కింద రూ.9.7 లక్షల కోట్లకు పైగా విడుదల చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు.
కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ రూ.83,467.85 కోట్లు కాగా, 2020–21లో అది రూ. 1,31,229.51 కోట్లకు చేరింది. 2021–22లో రూ.1,57,640.08 కోట్లు, 2022–23లో రికార్డు స్థాయిలో రూ.2,54,798.93 కోట్లు, 2023–24లో రూ.1,95,420.51 కోట్లు, 2024–25లో రూ.1,77,129.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆగస్టు 7 వరకు రూ.62,983.61 కోట్ల సబ్సిడీ భారం భరించినట్లు మంత్రి వెల్లడించారు.
పెరిగిన ఉత్పత్తి.. తగ్గిన దిగుమతులు
2019–20లో దేశంలో 425.95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి ఇది 503.35 లక్షల టన్నులకు చేరుకుంది. 2024–25లో 517.90 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2025–26లో జూన్ వరకు 120.63 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి అయిననట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. మరోవైపు విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు క్రమంగా తగ్గుతుండడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. దిగుమతులు 2019–20లో 184.09 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2023–24లో 176.95 లక్షల టన్నులకు, 2024–25లో 160.29 లక్షల టన్నులకు తగ్గాయి. 2025–26లో జూలై వరకు 48.54 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి అయ్యాయి.