
ఈపీఎఫ్‌వోలో పెరుగుతున్న సభ్యులు
2024–25లో రికార్డు స్థాయి నమోదు
ముంబై: దేశంలో ఉద్యోగ మార్కెట్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా సంఘటిత రంగంలో ఉపాధి వైపు కార్మికులు అడుగులు వేస్తున్నారు. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో సభ్యుల చేరిక ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను తాకుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి సభ్యుల చేరిక దీన్నే సూచిస్తున్నట్టు క్వెస్ కార్ప్ నివేదిక తెలిపింది. సుమారు 1.4 కోట్ల మంది గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో నికరంగా చేరారు.
2018–19 సంవత్సరంలో నికర సభ్యుల నమోదు 61 లక్షలతో పోల్చి చూస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. క్వెస్ కార్ప్ విడుదల చేసిన ‘ఇండియా వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. దేశంలో 57 కోట్ల మంది కారి్మకుల్లో ఇప్పటికీ 80 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. 2024–25లో కొత్తగా చేరిన ఈపీఎఫ్‌వో సభ్యుల్లో 61 శాతం మంది వయసు 29 ఏళ్లలోపే ఉంది. ఇందులోనూ సగం మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. యువ భారతీయుల మొదటి ఎంపిక సంఘటిత రంగంలోని ఉద్యోగమేనని క్వెస్‌కార్ప్ నివేదిక తెలిపింది.
పెరిగిన మహిళా భాగస్వామ్యం..
2025 మార్చి నాటికి సంఘటిత రంగంలోని మహిళా కారి్మకుల భాగస్వామ్యం 41.7 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సభ్యులు ప్రతి ముగ్గురిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. ఉపాధి కల్పన పరంగా రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ, టెలికం అగ్రగామి రంగాలుగా ఉన్నాయి. మానవ వనరుల సేవలు అందించే క్వెస్ కార్ప్.. 2024–25లో అత్యధికంగా 1.03 లక్షల మందికి టెలికంలో ఉపాధి చూపించింది. ఇందులో 43,000 మంది కొత్త సభ్యులు ఉన్నారు.
తయారీ రంగంలో ఉద్యోగాలు గత నాలుగేళ్లలో ఏటా 32 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయి. నియామకాల పరంగా అధిక వృద్ధి ఈ రంగంలో నమోదైంది. ఇక సగటున రూ.28,500 వేతనంతో బీఎఫ్‌ఎస్‌ఐ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత రిటైల్‌లో రూ.23,000 వేతనం ఉంది. ‘‘ఉద్యోగుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు వీలుగా సామాజిక వసతుల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి సారించాలి. సురక్షితమైన వసతి, రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా ఇందుకు సంబంధించి ఆందోళలను పరిష్కరించొచ్చు’’అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు.