
జూలైలో రికార్డు స్థాయిలో రూ. 42,702 కోట్లు
రూ. 75 లక్షల కోట్లు దాటిన ఏయూఎం
యాంఫీ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికాతో టారిఫ్‌లపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జూలైలో నికరంగా రూ. 42,702 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. ఈ విభాగానికి సంబంధించి నెలవారీగా చూస్తే ఇది రికార్డు స్థాయి.
జూన్‌లో నమోదైన రూ. 23,587 కోట్లతో పోలిస్తే ఏకంగా 81 శాతం ఎగిశాయి. అలాగే, వరుసగా 53వ నెలా ఈక్విటీల్లోకి పెట్టుబడులు వచి్చనట్లు ఫండ్స్ పరిశ్రమ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) తొలిసారిగా రూ. 75 లక్షల మార్కును దాటింది.
‘టారిఫ్ యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత వృద్ధి గాథ పటిష్టంగానే ఉంది. నెమ్మదించిన ద్రవ్యోల్బణం, లిక్విడిటీ.. పొదుపు మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో ఈక్విటీల్లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం ఇందుకు నిదర్శనం‘ అని యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని చెప్పారు. మార్కెట్లు మధ్యమధ్యలో కరెక్షన్‌లకు లోనవుతుండటమనేది ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇచ్చేందుకు ఆకర్షణీయమైన అంశంగా నిలి్చందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు.
యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు..
→ జూలైలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ. 49,000 కోట్లు, మే నెలలో రూ. 29,000 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. పెట్టుబడుల ప్రవాహంతో జూన్‌లో రూ. 74.4 లక్షల కోట్లుగా ఉన్న పరిశ్రమ ఏయూఎం జూలైలో రూ. 75.36 లక్షల కోట్లకు చేరింది.
→ ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌కి సంబంధించి సెక్టోరల్/థీమాటిక్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ. 9,426 కోట్లు నికరంగా వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో కొత్త స్కీములు మొత్తం రూ. 7,404 కోట్లు సమీకరించాయి. తర్వాత స్థానంలో రూ. 7,654 కోట్ల పెట్టుబడులతో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఉన్నాయి. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండటం వీటికి సానుకూలంగా నిలిచింది. ఇక స్మాల్ క్యాప్ ఫండ్స్ (6,484 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,182 కోట్లు), లార్జ్..మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,035 కోట్లు)లోకి కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి మాత్రమే రూ. 368 కోట్లు తరలిపోయాయి.
→ జూన్‌లో నమోదైన రూ. 27,269 కోట్లతో పోలిస్తే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా పెట్టుబడులు రూ. 28,464 కోట్లకు పెరిగాయి.
→ రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో డెట్ ఫండ్స్ జూలైలో పటిష్టంగా పుంజుకున్నాయి. లో–డ్యూరేషన్, మనీ మార్కెట్ ఫండ్స్‌తో పాటు లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి కూడా పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో రూ. 1.711 కోట్ల పెట్టుబడులు నికరంగా తరలిపోయాయి.
→ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు జూన్‌లో నమోదైన రూ. 2,081 కోట్లతో పోలిస్తే క్షీణించి రూ. 1,256 కోట్లకు పరిమితమయ్యాయి. వేగం నెమ్మదించినప్పటికీ వరుసగా మూడో నెలా ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం గమనార్హం. అనిశ్చితి వేళ పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌కి అనువైన సాధనంగా పసిడి ఆకర్షణీయత కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు.