
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ఎక్కువగా వినియోగిస్తోంది మనమే
ఖరీఫ్‌లో కర్ణాటకలో 11.17 లక్షల మెట్రిక్ టన్నుల వాడకం
9.80 ఎల్‌ఎంటీలతో రెండోస్థానంలో తెలంగాణ
దేశంలో అత్యధికంగా యూపీలో 40 ఎల్‌ఎంటీల యూరియా వాడకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా యూరి యా వినియోగం పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఎరువులు, అందునా యూరియా వాడకం ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో సైతం అధిక యూరియా వినియో గం నమోదవుతుండగా..దక్షిణాది రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రెండోస్థానంలో ఉండడం గమనార్హం. ఖరీ ఫ్ సీజన్‌లో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ వంటి ఎరువులను అత్యధికంగా కర్ణాటక 26.75 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ) వినియోగిస్తుండగా, అందులో ఒక్క యూరియా వినియోగమే 11.17 లక్షల మెట్రిక్ టన్ను లుగా ఉంది.
ఇక కర్ణాటక తరువాత తెలంగాణలో ఒక సీజన్‌లో మొత్తం 23.75 ఎల్‌ఎంటీల మేర ఎరువులు వినియోగిస్తుండగా..అందులో యూరియా 9.80 ఎల్‌ఎంటీలు ఉండటం గమనార్హం. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ రాష్ట్రంలో మాత్రమే ఎరువుల వాడకం అతి తక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ఖరీఫ్‌లో వినియోగించే యూరియా కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే కావడం కావడం విశేషం. డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్, ఎస్‌ఎస్‌పీ ఎరువుల వినియోగం కూడా ఈ రాష్ట్రంలో అతితక్కువగా ఉంది. ఏపీలో 6.22 ఎల్‌ఎంటీ, తమిళనాడులో 4.37 ఎల్‌ఎంటీ యూరియాను వినియోగిస్తుండగా, పాండిచ్చేరీలో 6 వేల టన్నులను మాత్రమే వాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ టాప్
కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి యూరియా కోసం రూ.1.19 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే రూ.30,940 కోట్లు సబ్సిడీ విడుదల చేసింది. దేశంలో యూరియాతో పాటు ఎరువుల వినియోగం ఏయేటికాయేడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. యూరియాపై ఒకవైపు రూ.లక్షల కోట్లు భరిస్తూనే సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
సేంద్రీయ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ పరిశోధన సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రైతులు అధిక దిగుబడి లక్ష్యంగా ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ ఎరువుల వినియోగంలో అగ్రభాగాన ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక సీజన్‌కు 40 ఎల్‌ఎంటీల చొప్పున యూరియా వినియోగిస్తున్నారు.
ఇక దేశ పశి్చమ ప్రాంతంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవాల్లో 61.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. గోవాలో అతి తక్కువగా కేవలం వెయ్యి మెట్రిక్ టన్నులే వినియోగిస్తుండడం గమనార్హం. తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో బిహార్‌లో అత్యధికంగా 10.32 ఎల్‌ఎంటీ యూరియాను వినియోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సిక్కిం, నాగాలాండ్‌లలో అసలు ఎరువులే వినియోగించడం లేదు.