పచ్చిక మాటున విష సర్పాలు

Farmers Careful On Poisonous Snakes In Agricultural Fields - Sakshi

అన్నదాతలూ పారాహుషార్‌ 

మంత్రాలు, నాటువైద్యం అంటూ అలస్యం చేయొద్దు 

సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు 

నిడదవోలు: ఖరీఫ్, రబీ సీజన్లు ప్రారంభంకాగానే రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు వర్షాలు ప్రారంభం కాగానే అంతవరకూ కనిపించని విష సర్పాలు బయటకొచ్చి పొలాల్లో యథేచ్ఛగా తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పొలాల్లో తిరిగే రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పాము కాటుకు గురైనా ధైర్యంగా ఉంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో 2020 జనవరి నుంచి 2021 జూన్‌ 30 వరకు 1,686 మంది పాము కాటుకు గురయ్యారు. ఇవి అధికారికంగా నమోదైన వివరాలు మాత్రమే.

జిల్లాలో సార్వా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం, వర్షాలు కురవడంతో పొలాల్లోని బొరియల్లో ఉన్న విష పురుగులు, పాములు బయటకు వస్తుంటాయి. రైతులు ఆదమరిస్తే పాము కాటుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. పొలాల్లో పాముకాటు వల్ల రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పొతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. పాము కాటేస్తే సకాలంలో వైద్యం అందించపోతే మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

పాము కాటుకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలనే అంశాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరం. ప్రతీ ఏటా దాళ్వా పంట ముగిశాక పొలాలకు రైతులు తక్కువగా వెళ్తుంటారు. తిరిగి రెండు నెలలు పొలాల్లో అలికిడి లేకపోవడంతో పాములు పాగావేస్తాయి. పొలాల నుంచి పాములు ఇళ్ళల్లోకి వచ్చి పెరట్లో నక్కుతాయి. 

పాములను గుర్తించండిలా
పొడపాముని రక్త పింజరని పిలుస్తారు. ఇది గోధుమ రంగులో ఉండి ఒంటిపై డైమండ్‌ ఆకారంలో గుర్తులు మూడు వరుసల్లో ఉంటాయి. తలపై బాణం గుర్తు ఉంటుంది. ఇది కాటేసిన భాగం ఉబ్బెత్తుగా ఉండి నొప్పి కలిగిస్తుంది. అరగంట లోపే చెవులు, నోటి వెంట రక్తస్రావమవుతుంది.  నాగు పాము ముదురు గోధమ  రంగులో ఉంటుంది. దీనిలో విష ప్రభావం అధికంగా ఉంటుంది. కట్లపాము నలుపు రంగులో ఉండి ఒంటిపై నలుపు, తెలుపు చారలు ఉంటాయి. 

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
పూర్వం రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు శబ్దం వచ్చే చెప్పులు వేసుకోనేవారు. ఆ శబ్దాలకు పాములు పారిపోయేవి. ఇప్పుడు అలాంటి చెప్పులు వేసుకోకపోయినా.. పొలాల్లో తిరిగేటప్పుడు తప్పనిసరిగా పాద రక్షలు ధరించాలి. కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు వెళ్ళిపోతాయి. ధాన్యపు గాదెలు, గడ్డి వాములు, తడిగా ఉంటే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి. దుంగలు, కట్టెలు, పచ్చిక బయళ్ళలో పాములు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు తప్పకుండా టార్చిలైట్‌ తీసుకెళ్ళాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం, ముళ్ళ పొదలు లేకుండా చూసుకోవాలి. గోడల వారన, కట్టెల్లో  పాములు నక్కే అవకాశమున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. 

పాము కరిచిన వెంటనే ఏం చేయాలి 
సాధారణంగా విషం ఉన్న పాము కాటు వేసిన చోట రెండు కొరల గాయం కనిపిస్తుంది. నొప్పి తట్టుకోలేం. నొప్పి క్రమంగా పైకి వ్యాపించి తిమ్మిరిగా అనిపిస్తుంది. గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, నాటుక మందమైనట్లు, గొంతులో ఏది దిగనట్లు అనిపిస్తుంది. చొంగ కారడంతో పాటు శరీరం మత్తుగా ఉంటుంది.  పాము విషం కన్నా చాలా మంది పాము కాటేసిందన్న భయంతోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. పాము కాటుకు గురైనా వ్యక్తికి ధైర్యం చెప్పాలి.  కొన్ని పాములే విషపూరితం. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచుపాము, కట్లపాము, పొడపాము వంటి 15 సర్ప జాతులు ప్రమాదకరమైనవి. పాము కాటు వేస్తే మంత్రాలు, నాటు వైద్యమంటూ ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని ఎట్టిపరిస్థితిలో నడిపించరాదు. సాధ్యమైనంత వరకు ఎత్తుకుని వాహనంలో కుర్చోపెట్టి తీసుకెళ్ళాలి.  

యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌ వేయించాలి 
పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. చాలా వరకు విషం లేని పాములు కరుస్తుంటాయి. విషం ఉంటే మంత్రాలకు తగ్గదు. విషానికి యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తాచుపాము వంటివి కరిస్తే రెండు గాట్లు పడతాయి. పాము కాటుకి గురైన వ్యక్తులు చాలా మంది భయంతో గుండె ఆగి చనిపోతున్నారు. సాధారణంగా 70 శాతం పాముల్లో విషం ఉండదు. పాము కరచిన వ్యక్తికి ధైర్యం చెప్పి వైద్యుని దగ్గరకు తీసుకువచ్చి ఇంజెక్షన్‌ ఇప్పించాలి.  
– డాక్టర్‌ అమరేంద్ర, వైద్యుడు, సమిశ్రగూడెం పీహెచ్‌సీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top