
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఆయన అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ లేఖలో పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. దీంతో, సదరు లేఖపై చంద్రచూడ్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. కాగా, ఈ బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ క్రమంలో.. బంగ్లాను జస్టిస్ డీవై చంద్రచూడ్ నుంచి ఆలస్యం చేయకుండా స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం. ఆయన పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా ఆరు నెలలు అవుతోంది అని సుప్రీంకోర్టు.. హౌసింగ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) శాఖ కార్యదర్శికి రాసిన లేఖ రాసింది.
ఇక, సుప్రీంకోర్టు రాసిన లేఖపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ..‘కొన్ని వ్యక్తిగత అవసరాల కారణంగా ఆలస్యమైందన్నారు. త్వరలోనే బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తానన్నారు. కొన్ని పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందన్నారు. అలాగే, తుగ్లక్ రోడ్‌లోని బంగ్లా నంబర్ 14ను ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయ వసతిగా ఇప్పటికే కేటాయించినప్పటికీ.. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా అందులోకి మారలేదని వెల్లడించారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు సేవలందించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 10న చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు. దీంతో, అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరూ కూడా అధికారిక నివాసంలోకి మారలేదు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు లేఖ రాసినట్టు తెలుస్తోంది.