
2024లోనూ 10 శాతం పెరిగిన డిమాండ్
మూడో వంతు వాటా ఏసీలదే
విద్యుత్ ఉద్గారాల్లోనూ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచమంతటా విద్యుత్ డిమాండ్ ఏయేటికాయేడు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వేసవిలో భారత్‌లో విద్యుత్ డిమాండ్ 9 నుంచి 10 శాతం పెరగనుందని గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ‘ఎంబర్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’అంచనా వేసింది. ‘‘ఏప్రిల్ నుంచి జూన్ దాకా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వడగాల్పుల రోజులు కూడా పెరుగుతాయి.
అందుకే విద్యుత్ డిమాండ్ బాగాపెరగనుంది’’అని మంగళవారం విడుదల చేసిన కొత్త నివేదికలో వెల్లడించింది. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో ఎయిర్ కండిషన్ల సంఖ్య మరో 15 కోట్ల దాకా పెరుగుతుందని పేర్కొంది. దాంతో 2035 నాటికి పీక్ అవర్ విద్యుత్ డిమాండ్ ఏకంగా 180 గిగావాట్లకు పెరిగి విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర భారం పడుతుందని తెలిపింది.
2024లో ప్రపంచవ్యాప్తంగా..
2024లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది ప్రపంచ విద్యుత్ డిమాండ్ పెరుగుదలలో ఐదో వంతుకు వడగాలులే కారణం. దాంతో ప్రపంచ విద్యుత్ రంగ ఉద్గారాలు 2024లో 1.6 శాతం పెరిగాయి. 22.3 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. దాంతో మొత్తం ఉద్గారాలు రికార్డు స్థాయిలో 1,460 కోట్ల టన్నులకు పెరిగాయి.
భారత్‌లో...
2024 ఏప్రిల్–జూన్ మధ్య మన దేశంలో విద్యుత్ డిమాండ్ 10.4 శాతం పెరిగింది. మొత్తం విద్యుత్ వాడకంలో ఎయిర్ కండిషనర్ల వాటాయే 30 శాతం! 2024 మే 30న జాతీయ స్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 250 గిగావాట్లు దాటింది. ఇది అంచనాల కంటే 6.3 శాతం ఎక్కువ! 2024లో దేశంలో వడగాల్పుల తరచుదనం, తీవ్రత పెరిగాయి. జాతీయ గృహ విద్యుత్ వినియోగం వాటా 2012–13లో 22 శాతం కాగా 2022–23 నాటికి 25 శాతానికి పెరిగింది. ఆర్థిక వృద్ధి, పెరిగిన వేడి వంటివి శీతలీకరణకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో చైనా, నైజీరియా, ఇండొనేíÙయా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.