కాకినాడ రూరల్ / సామర్లకోట: ఓ మహిళతో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన, యువకుడు, జేసీబీ డ్రైవర్ వానపల్లి వెంకట సురేష్ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం అవంతినగర్‌లో టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. హైటెన్షన్ విద్యుత్ లైన్ స్తంభం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీగలను తాకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో పాటు దాదాపు రెండు గంటల పాటు టవర్‌పైనే ఉండిపోయాడు.
సమాచారం అందుకున్న తిమ్మాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పనసపాడ గ్రామస్తులు టవర్ వద్దకు చేరుకుని వెంకట సురేష్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేశ్వరరావు, తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్ సెల్ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడిన వెంకట సురేష్ తాను ప్రేమించిన మహిళ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడడంతో, వారు అల్లరి చేయవద్దని మాట్లాడుకుందామని నచ్చజెప్పడంతో కొద్దిసేపటికి స్తంభం నుంచి తాను కిందకు రావడంతో పోలీసులు, పనసపాడు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం యువకుడిని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం టవర్ ఎక్కి ఆందోళన చేస్తానని హెచ్చరించినట్టుగా వెంకట సురేష్ గురించి గ్రామస్తులు పేర్కొన్నారు. మాధవపట్నంకు చెందిన ఓ మహిళ భర్తను విడిచి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. పెళ్లి కోసం ఒత్తిడి తీసుకు రావడంతో ఆమె వెంకట సురేష్ సెల్ నంబరు, వాట్సాప్ బ్లాక్‌లో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సెల్ టవర్ ఆ యువకుడు బెదిరింపులకు దిగాడు.


