పైలట్‌ పంతంతో నిలిచిన ప్రాణం | Eknath Shinde flight delay turns lifesaver for kidney patient | Sakshi
Sakshi News home page

పైలట్‌ పంతంతో నిలిచిన ప్రాణం

Jun 8 2025 6:02 AM | Updated on Jun 8 2025 6:02 AM

Eknath Shinde flight delay turns lifesaver for kidney patient

జల్గావ్‌ ఎయిర్‌పోర్టుకు ముందుగానే వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే 

విమానం టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ నిరాకరణ 

విమానం మిస్సయిన మహిళా రోగిని తన విమానంలో ముంబైకి చేర్చిన షిండే

థానే: మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలో ఆసక్తికర మైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే షెడ్యూల్‌ కంటే ముందే జల్గావ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం, విమానం టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ నిరాకరించడం.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యాయి. జల్గావ్‌ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో సంత్‌ ముక్తి పల్లకి యాత్రలో పాల్గొనేందుకు ఏక్‌నాథ్‌ షిండే శుక్రవారం తన చార్టెర్డ్‌ విమానంలో ముంబై నుంచి జల్గావ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు రావాల్సి ఉండగా, దాదాపు మూడు గంటలు ఆలస్యంగా 6.15 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. 

ఏక్‌నాథ్‌ షిండే ఎయిర్‌పోర్టు నుంచి ముక్తాయ్‌నగర్‌ వెళ్లి పల్లకి యాత్రలో పాల్గొని ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.15 గంటలకు తిరిగివచ్చారు. అయితే, గంట ముందే రావడంలో విమానం టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ నిరాకరించాడు. షెడ్యూల్‌ ప్రకారమే వెళ్లాలని తేల్చిచెప్పాడు. మహారాష్ట్ర మంత్రులు గిరీష్‌ మహాజన్, గులాబ్‌రావు పాటిల్‌తోపాటు జిల్లా అధికారులు దాదాపు 45 నిమిషాలపాటు ఎయిర్‌పోర్టులో చర్చలు జరిపారు. పైలట్‌ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు అతడు అంగీకరించాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. 

ఏం జరిగింది? 
జల్గావ్‌కు చెందిన శీతల్‌ పాటిల్‌కు ముంబైలో అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచి కిత్స జరగాల్సి ఉంది. జల్గావ్‌ నుంచి విమానంలో వెళ్లాల్సి ఉండగా, ఎయిర్‌పోర్టుకు చేరుకొనేసరికే  విమానం వెళ్లిపోయింది. అదే సమయంలో ఏక్‌నాథ్‌ షిండే అదే ఎయిర్‌పోర్టులో తన విమానం కోసం వేచి చూస్తున్నారు. పైలట్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో శీతల్‌ పాటిల్‌ గురించి స్థానిక నాయకులు ఏక్‌నాథ్‌ షిండే దృష్టికి తీసుకెళ్లారు. పైలట్‌ టేకాఫ్‌కు అంగీకరించడం, విమానం సిద్ధం కావడం జరిగిపోయాయి. దాంతో ఆయన శీతల్‌ పాటిల్‌ను, ఆమె భర్తను తనతోపాటు చార్టెర్డ్‌ విమానంలో ముంబైకి తీసు కెళ్లారు. 

ముందే సమాచారం ఇచ్చి ముంబై ఎయిర్‌ పోర్టులో ప్రత్యేక అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే శీతల్‌ బోర్డేను ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి అనుకున్న సమయానికే శీతల్‌ బోర్డే ఆసుపత్రికి చేరుకున్నారు. ఏక్‌నాథ్‌ షిండే విమానాన్ని టేకాఫ్‌ చేయడానికి పైలట్‌ మొండికేయడం ఆమె ప్రాణాలను కాపాడిందని స్థాని కులు పేర్కొన్నారు. సామాన్య ప్రజల బాగు కో సం ఏక్‌నాథ్‌ షిండే తపన పడుతుంటారని, వారి సేవ కోసం ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని మంత్రి గిరీష్‌ మహాజన్‌ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement