pallaki yatra
-
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పండరీపురంలో జరగనున్న ఆషాడీ ఏకాదశి మహోత్సవం సందర్భంగా శ్రీసంత్ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర జూన్ 2న ఉదయం 7 గంటలకు షేగావ్ నుంచి వైభవంగా ప్రారంభమవుతుంది. శతాబ్దాలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యాత్ర 56వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డప్పులు, మృదంగాల శబ్దాలతో, చేతుల్లో భగవద్ ధర్మ పతాకాలు పట్టుకుని హరినామ జపం చేస్తూ వందలాది మంది వార్కారీలు ఈ పుణ్య యాత్రలో భాగమవుతున్నారు. ఈ పల్లకీ ఊరేగింపు ద్వారా భక్తులు విఠోబా దర్శనం చేసుకునేందుకు పండరీపురం చేరుకుంటారు. ఈ యాత్రలో జెండా మోసే వారు, గాయకులు, ముండాగ్ వాయించే కళాకారులు, సేవకులు కలిపి సుమారు 700 మంది పాల్గొంటున్నారు. యాత్రలో ఒక వినికారి, ఒక తల్కారి, ఒక జెండా మోసేవాడు తదితరులు క్రమశిక్షణతో నడుస్తూ ప్రతి గ్రామంలో భజన, కీర్తన, ఉపన్యాసాల ద్వారా భగవద్ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా వార్కారీలు హరినామ స్మరణతో ముందుకు సాగుతారు. జూన్ 2న నాగజారి శ్రీ క్షేత్రం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు సాగి జూలై 4న పండరీపురానికి చేరుకుంటుంది. మంగళవేదం వద్ద చివరి బస అనంతరం శ్రీ పల్లకీ పండరీపురం ప్రవేశిస్తుంది. అక్కడ జూలై 4 నుంచి 9 వరకు ఉత్సవాల్లో పాల్గొని, జూలై 10న తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర షేగావ్‌లో జూలై 31న యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో పరాస్, గైగావ్, అకోలా, పర్లి, అంబజోగై, షోలాపూర్ వంటి అనేక పట్టణాలు, గ్రామాలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతి రోజు ఉదయం హరిపథ్, భజనలు, శ్రీచి ఆరతి వంటి కార్యక్రమాలతో ఈ యాత్ర ప్రత్యేకంగా సాగుతోంది. పండరీభూమి అడుగుపెట్టే ముందు వార్కారీలు అక్కడి మట్టిని నుదుటిపై పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. యాత్ర ముగిసే వరకు వారి నడకదారిలో విఠల్ విఠల్ నినాదమే ప్రతిధ్వనిస్తుంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
అదనపు మరుగుదొడ్లు నిర్మిస్తారా.. యాత్రికులను అడ్డుకోమంటారా?
సాక్షి, ముంబై: పండరీపూర్‌కు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం నాలుగువేల మరుగుదొడ్లను నిర్మించాలని బాంబై హైకోర్టు ఆదేశించింది. ఆషాడ ఏకాదశిని పురస్కరించుకొని విఠలేశ్వరుడు, రుక్మిణీబాయిని దర్శించుకునేందుకు కాలినడకన, పల్లకీలను మోసుకుంటూ లక్షలాదిమంది పండరీపూర్‌కు చేరుకుంటారు. అయితే ఇక్కడ మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉండడంతో వచ్చే యాత్రికులతోపాటు స్థానికులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడంతో చంద్రబాగా నది తీరంతోపాటు పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ దుర్గంధభరితంగా మారుతున్నాయి. దీంతో స్థానికులు కూడా అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై ‘క్యాంపేయినింగ్ ఎగెనైస్ట్ స్కావెన్జింగ్ ఇన్ మహారాష్ట్ర’ పేరుతో ఓ సంస్థ అధ్యయనం జరిపి, పండరీపూర్ దుస్థితిని ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్. చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఇక్కడి మౌలిక వసతుల ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం నాలుగువేల మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని, లేదంటే యాత్రికుల రాకపై నిషేధం విధించే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రజలకు ఇబ్బందులు కలిగే ఎలాంటి పనులను చేయకూడదని చట్టం చెబుతోంది. పండరీపూర్‌కు పల్లకీలను మోస్తూ భక్తులు రావడం మంచి ఉద్దేశమే కావొచ్చు. అయితే అలా వచ్చే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు(మరుగుదొడ్లు) లేకపోవడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్గంధభరితంగా మారుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచి ఉద్దేశంతోనే యాత్రికులు వస్తున్నా ఇక్కడివారి హక్కులను కాలరాస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయినా హక్కులను కాపాడడం అంతకంటే ముఖ్యం. హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. అక్కడి ప్రజలు పడే ఇబ్బందులను పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మౌలిక వసతుల కల్పనలో సంబంధిత ప్రభుత్వ విభాగాలు విఫలమైతే మేం చర ్యలు తీసుకోవాల్సి ఉంటుంద’ని హెచ్చరించింది. ఇక యాత్రికులు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయరాదని సూచించింది. అంతేకాక నాలుగువేల మరుగుదోడ్లను ఎలా, ఎక్కడ నిర్మించనున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ తమ వైఖరి స్పష్టం చేయలేదు. ఇదిలాఉండగా పండర్‌పూర్‌లో 2,500 పర్మినెంటు మరుగుదోడ్లు ఉన్నాయి. పల్లకీయాత్ర సమయంలో కార్పొరేషన్ తరఫున 500లు, ఆలయ యాజమాన్యం 200ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తాయి. కానీ వచ్చే భక్తులకు ఇవి ఎటూ సరిపోడంలేదు. దీంతో నదీ పరిసరాలు, ఇతర ప్రాంతాలు కూడా దుర్గంధంగా మారుతున్నందునే అదనంగా నాలుగువేల మరుగుదొడ్లను నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. -
జయ జయ విఠల..
పింప్రి, న్యూస్‌లైన్: భక్త తుకారాం మహారాజ్ 329వ పల్లకీ యాత్ర గురువారం ప్రారంభం కావడంతో లక్షలాదిగా తరలివచ్చిన వార్కారీలతో దేహూ కిక్కిరిసిపోయింది. పల్లకీ యాత్ర ద్వారా పండరీపూర్ విఠల్‌ను భక్తులు దర్శించుకోనున్నారు. కాగా ఈ యాత్ర జూలై 8వ తేదీతో ముగియనుంది. లక్షలాది వార్కారీల జయ జయ విఠల నామస్మరణతో దేహూ మారుమోగింది. మహిళలు తలపై తులసి బృందావనాలు, పురుషులు తంబురలు, వీణలు, మృదంగాలు పట్టుకొని పాండురంగడి భక్తి కీర్తనలతో నాట్యాలు చేస్తూ పల్లకీ యాత్రలో పాల్గొన్నారు. తేలికపాటి వర్షం కురవడంతో భక్తులు ఆనందంతో తడిసి పరవశించిపోయారు. గత 24 గంటల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. దేహూలో ఇంద్రాయణి నది తీరం వెంబడి బుధవారం అర్ధరాత్రి నుంచి భక్తులు స్నానాదులు ఆచరించారు. సంత్ తుకారాం మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటుచేశారు. పల్లకీ యాత్ర కోసం వెండి పల్లకీ రథాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వెండి పల్లకి, పాదుకలు, పీఠాన్ని అభిషేకించి అలంకరించారు. పల్లకీయాత్రలో పాల్గొనడానికి 329కి పైగా దిండీ (బృందాలు)లు దేహూ విచ్చేశాయి. ఉదయం 5.30 గంటలకు పాండురంగడి మహాభిషేకం, పంచామృతాభిషేకం, మహాపూజలను నిర్వహించారు. 6 గంటలకు శిలా మందిరంలో మహాపూజ, 6.30 గంటలకు వైకుంఠ స్థాన మందిరంలో పూజలు జరిపారు. 7 గంటలకు తపోనిధి నారాయణ మహారాజ్ సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు మహద్వారం నుంచి దర్శనం కల్పించారు. ఉదయం 11 గంటలకు సంత్ తుకారం మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. పాదుకలను పల్లకీలో ఉంచుకొని తుకారాం ముఖ్య మందిరం నుంచి బయటకు రాగా భక్తులు ఒక్కసారిగా తుకారం, విఠల్ నామస్మరణతో ప్రతిధ్వనింప చేశారు. ఈ పల్లకీ యాత్ర గురువారం దేహులోని ఇనాందార్ సాహెబ్ వాడాలో ఆగి శుక్రవారం ఉదయం శ్రీ క్షేత్రదేహు నుంచి బయలుదేరి అనగద్షాహ బాబా వద్ద అభంగ్ హారతీ నిర్వహిస్తారు. చించోలిలో పాదుకలకు అభంగ్ హారతి నిర్వహించిన అనంతరం నిగిడి మీదుగ వెళ్లి ఆకృడిలోని శ్రీ విఠల్ మందిరంలో శుక్రవారం రాత్రికి బస చేస్తారు. పల్లకీ బందోబస్తుకుగాను సుమారు 1500 మంది పోలీసులు, హోంగార్డులను నియమించారు. వీరితోపాటు 4 బాంబు తనిఖీ బృందాలు పనిచేస్తున్నాయి. పల్లకీ మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. భద్రతా విషయమై పల్లకీ మార్గంలో ప్రతి కూడలిలో నాలుగు నుంచి 5 ధర్మశాలలను పోలీసులకు అప్పగించారు. జేబు దొంగలు, భక్తులకు అసౌకర్యానికి గురి చేస్తున్నవారిని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి విజయ్ మగర్ తెలిపారు. పల్లకీ వెంట 20 మంది కేంద్ర సురక్ష దళానికి చెందిన కమాండోలు కూడా విధులు నిర్వహిస్తున్నారు. -
పల్లకీయాత్రకు సర్వం సిద్ధం
పింప్రి, న్యూస్‌లైన్: సంత్ తుకారాం మహారాజ్ పల్లకీ యాత్ర ప్రత్యేక పూజలు గురువారం ఉదయం దేహూలో ప్రారంభం కానున్నాయి. పల్లకీ యాత్ర పూజను రాష్ర్ట మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రారంభించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. పండరీపూర్ విఠల్‌ను పల్లకీ యాత్ర ద్వారా దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో దేహూ కిటకిట లాడుతోంది. వైకుంఠ స్థాన మందిరం పరిసరాలు వివిధ దిండీలతో నిండిపోయాయి. పోలీసులు మంగళవారం నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు పింప్రి గురుద్వారా సమితి ఆధ్వర్యంలో వైకుంఠ స్థాన మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గురుద్వారా కార్యకర్తలు తెలిపారు. ఎనిమిది రోజులుగా ప్రధాన మందిరంలో హరినామ జపం, కీర్తనలు, భజనలు నిర్వహిస్తున్నారు. భక్తులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. దేహూ పరిసరాల పరిశుభ్రతకు 24 గంటలు స్వయం సేవకులు శ్రమిస్తున్నారు. ఇంద్రాయణీ నదీ స్వచ్ఛతకు అందరూ సహకరించాలని, నదిలో చెత్త వేయకూడదని అఖిల విశ్వ గాయత్రీ పరివార్‌కు చెందిన శైలేంద్ర పాటిల్ భక్తులకు పిలుపునిచ్చారు. అడుగడుగునా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు.. పల్లకీ యాత్ర సందర్భంగా దేహూ, ఆలందిలో పటిష్ట బందోబస్తుతోపాటు నగర పరిషత్ ఆలయ పరిసరాలలో సుమారు 50కి పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేశామని ముఖ ్య అధికారి వినాయక్ డౌండ్కర్ తెలిపారు. భక్తులకు మొబైల్ ఆస్పత్రులతోపాటు మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటుచేశారు. ప్రత్యేక పూజలు... గురువారం ఉదయం 5.30 గంటలకు దేహూరోడ్‌లోని భక్త తుకారాం మందిరంలో పాండురంగడి మహాపూజ, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శిలా మందిరంలో ఆరు గంటలకు పూజలు ప్రారంభించనున్నారు. 6.30 గంటలకు వైకుంఠ స్థానం మందిరంలో పూజలు, 7 గంటలకు తపోనిధి నారాయణ మహారాజ్ సమాధి పూజ, 9 నుంచి 11 గంటల వరకు కీర్తనలు, భజనలు, 11 నుంచి విగ్రహాల ప్రతిష్ట ఉంటాయి. నాలుగు గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది.