
అదనపు మరుగుదొడ్లు నిర్మిస్తారా.. యాత్రికులను అడ్డుకోమంటారా?
పండరీపూర్‌కు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం నాలుగువేల మరుగుదొడ్లను నిర్మించాలని బాంబై హైకోర్టు ఆదేశించింది.
సాక్షి, ముంబై: పండరీపూర్‌కు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం నాలుగువేల మరుగుదొడ్లను నిర్మించాలని బాంబై హైకోర్టు ఆదేశించింది. ఆషాడ ఏకాదశిని పురస్కరించుకొని విఠలేశ్వరుడు, రుక్మిణీబాయిని దర్శించుకునేందుకు కాలినడకన, పల్లకీలను మోసుకుంటూ లక్షలాదిమంది పండరీపూర్‌కు చేరుకుంటారు. అయితే ఇక్కడ మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉండడంతో వచ్చే యాత్రికులతోపాటు స్థానికులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడంతో చంద్రబాగా నది తీరంతోపాటు పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ దుర్గంధభరితంగా మారుతున్నాయి. దీంతో స్థానికులు కూడా అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై ‘క్యాంపేయినింగ్ ఎగెనైస్ట్ స్కావెన్జింగ్ ఇన్ మహారాష్ట్ర’ పేరుతో ఓ సంస్థ అధ్యయనం జరిపి, పండరీపూర్ దుస్థితిని ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్. చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం ఇక్కడి మౌలిక వసతుల ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం నాలుగువేల మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని, లేదంటే యాత్రికుల రాకపై నిషేధం విధించే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రజలకు ఇబ్బందులు కలిగే ఎలాంటి పనులను చేయకూడదని చట్టం చెబుతోంది. పండరీపూర్‌కు పల్లకీలను మోస్తూ భక్తులు రావడం మంచి ఉద్దేశమే కావొచ్చు. అయితే అలా వచ్చే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు(మరుగుదొడ్లు) లేకపోవడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్గంధభరితంగా మారుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచి ఉద్దేశంతోనే యాత్రికులు వస్తున్నా ఇక్కడివారి హక్కులను కాలరాస్తున్నారు.
ఉద్దేశం మంచిదే అయినా హక్కులను కాపాడడం అంతకంటే ముఖ్యం. హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. అక్కడి ప్రజలు పడే ఇబ్బందులను పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మౌలిక వసతుల కల్పనలో సంబంధిత ప్రభుత్వ విభాగాలు విఫలమైతే మేం చర ్యలు తీసుకోవాల్సి ఉంటుంద’ని హెచ్చరించింది. ఇక యాత్రికులు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయరాదని సూచించింది.
అంతేకాక నాలుగువేల మరుగుదోడ్లను ఎలా, ఎక్కడ నిర్మించనున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ తమ వైఖరి స్పష్టం చేయలేదు. ఇదిలాఉండగా పండర్‌పూర్‌లో 2,500 పర్మినెంటు మరుగుదోడ్లు ఉన్నాయి. పల్లకీయాత్ర సమయంలో కార్పొరేషన్ తరఫున 500లు, ఆలయ యాజమాన్యం 200ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తాయి. కానీ వచ్చే భక్తులకు ఇవి ఎటూ సరిపోడంలేదు. దీంతో నదీ పరిసరాలు, ఇతర ప్రాంతాలు కూడా దుర్గంధంగా మారుతున్నందునే అదనంగా నాలుగువేల మరుగుదొడ్లను నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది.