
డా‘‘ అబ్దుల్ వహీద్ షేఖ్
బొంబాయి హైకోర్టు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌ల ద్విసభ్య ధర్మాసనం జూలై 21న ఒక చరిత్రా త్మకమైన తీర్పు ఇచ్చింది. అది పదిసంవత్సరాల కింద జరిగిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దడం మాత్రమే గాని పూర్తి న్యాయం అనడానికి కూడా వీలు లేదు.
ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2015లో అయిదుగురు నిందితులకు విధించిన మరణశిక్ష, ఏడుగురికి విధించిన యావజ్జీవ శిక్ష చెల్లవని, పందొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా రుజువు చేయలేకపోయిందని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందని, పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టి నేరాలు ఒప్పించారని, కూటసాక్ష్యాలు తయారుచేశారని, దర్యాప్తు ప్రక్రియ కళ్లకు గంతలు కట్టుకున్నట్టు ఇతర అవకాశాల వైపు చూడకుండా ఎవరో ఒకరిని ఇరికించి శిక్ష విధించే లక్ష్యంతో సాగిందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
దేశంలో కొనసాగుతున్న పోలీసు వ్యవస్థ మీద, దర్యాప్తు యంత్రాంగం మీద, ప్రాసిక్యూషన్ మీద, కిందిస్థాయి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శనాత్మక వ్యాఖ్యానం ఇది.
పందొమ్మిది సంవత్సరాల కింద, 2006 జూలై 11న ముంబాయి సబర్బన్ రైళ్లు రద్దీగా ఉండే సమయంలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగి 187 మంది మరణించారు, ఎనిమిది వందల మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన పెల్లు బికింది. మహారాష్ట్రలో అప్పుడు అధికారంలో ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేసు దర్యాప్తు చేయడానికి నియమించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కొద్ది నెలల్లోనే 13 మంది నేరస్థులను పట్టుకున్నామని ప్రకటించింది.
సరైన దర్యాప్తు జరపకుండానే కొందరు ముస్లిం అనుమానితులను పట్టుకుని వారి చేత నేరం ఒప్పించి కేసు నడిపే ఆనవాయితీని పాటించింది. పాకిస్తాన్ ఐఎస్‌ఐ, లష్కర్ ఎ తోయెబా, దేశంలో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లా మిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా, కొందరు భారతీయ అను చరులతో కలిసి కుట్ర చేసి ఈ బాంబు దాడులు చేశారని మహా రాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మకోకా), భారత శిక్షా స్మృతి, ఆయుధాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నడిపారు.
ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2007లో విచారణ ప్రారంభించి, 2015 సెప్టెంబర్‌లో పదమూడు మంది నిందితులలో పన్నెండు మందికి శిక్షలు విధించి, ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. అలా నిర్దోషిగా విడుదలైన వ్యక్తి డా‘‘ అబ్దుల్ వహీద్ షేఖ్ ప్రస్తుత హైకోర్టు తీర్పుకు ప్రధాన కారకులలో ఒకరు. అప్పటికి తొమ్మిది సంవత్సరాల పాటు జైలులో మగ్గిపోయి నిర్దోషిగా విడుదలయ్యాడు. అరెస్టుకు ముందు ఆయన ముంబైలో ఉపాధ్యాయుడుగా పని చేసేవారు. రాజకీయాలలో పాల్గొనడం కాదు గదా, వాటి మీద ఆసక్తి కూడా ఎన్నడూ చూపలేదు. తాను, తన ఉద్యోగం, కుటుంబంగా ఉండేవారు.
జైలులో ఉన్న కాలంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్‌ఎల్‌బీ చదివాడు. విడుదలయ్యాక శిక్షలు పడిన ఇతరనిందితులు కూడా తనలాగనే నిర్దోషులేననీ, వారి మీద ప్రాసిక్యూషన్ తప్పుడు కేసు బనాయించిందనీ, వారిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానంలో నిరూపించడమే తన లక్ష్యమని ‘ఇన్నోసెన్స్ నెట్వర్క్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి హైకోర్టు అప్పీలు ప్రక్రియలో పాలు పంచుకున్నాడు. ‘అక్విట్ అండర్ ట్రయల్’ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నిరపరా ధులైన ఖైదీల విషాద గాథలు వినిపించాడు. ఎల్‌ఎల్‌ఎం చదివి, దేశంలో నేర విచారణ వ్యవస్థ మీద పీహెచ్‌డీ చేశాడు. దేశమంతా ఎన్నోచోట్ల సభల్లో ఈ కేసు గురించి మాట్లాడాడు. ‘బేగునా ఖైదీ’ (నిరపరాధులైన ఖైదీలు) అని ఆయన ఉర్దూలో రాసిన పుస్తకం ఎన్నో భాషల్లోకి అనువాదమై ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ చేసిన అక్రమాల గుట్టు విప్పింది.
ఒకవైపు సామాజిక స్థాయిలో ఈ పోరాటం చేస్తూనే, న్యాయపోరాటాన్ని కూడా కొనసాగించాడు. మొత్తం కేసులో ప్రాసిక్యూషన్ వాదన అంతా నిందితుల ఒప్పుదల ప్రకటనల మీదనే ఆధారపడిందని, ఆ ఒప్పుదల ప్రకటనలు చిత్రహింసలు పెట్టి తయారు చేసినవని ఆయన వాదించాడు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఇతర సాక్ష్యాలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా, పరస్పర వైరుద్ధ్యాలతో ఉన్నాయని చూపాడు. పేలుడు పదార్థాలకు సంబంధించిన కీలక ఫోరెన్సిక్ నిర్ధారణలు బలహీనంగా, వీరే నిందితులు అని నిర్ధారించడానికి వీలు
లేకుండా ఉన్నాయని చూపాడు. సమాంతరంగా జరిగిన పరిశోధ నలు కూడా నిజంగా నేరస్థులు ఇతరులని నిర్ధారించాయి.
అప్పీలులో ఈ వాదనలను కూలంకషంగా పరిశీలించి హైకోర్టు ఇచ్చిన 671 పేజీల తీర్పు... ఆ ఒప్పుదల ప్రకటనల విశ్వసనీయతను ప్రశ్నించింది. సందర్భ సాక్ష్యం బలహీనంగా ఉందని చెప్పింది. కాల్ డాటా రికార్డులలో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చడంలో ప్రాసిక్యూషన్ తప్పులు చేసిందని చెప్పింది. సాక్షులు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా మాట్లాడారని గుర్తించింది. ప్రాసిక్యూషన్ చట్టపరమైన నిబంధ నలను ఉల్లంఘించిందని గుర్తించింది.
‘ఈ పోరాటం నా ఒక్కడిదే కాదు. అది సత్యం కోసం, న్యాయం కోసం, అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మా సమూహం కోసం జరిపిన పోరాటం’ అన్నాడు వహీద్. ఇప్పుడు నిర్దోషులుగా, లేదా నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేక పోయినవారిగా బైటపడిన పన్నెండు మందిలో ఒకరు 2021లో కోవిడ్‌తో జైలులోనే చనిపోయారు. మిగిలిన వారందరూ వారి ఇరవైల్లో జైలుకు వెళ్లి ఇప్పుడు నలభయ్యో పడి దగ్గర పడుతుండగా విడుదల అవుతున్నారు. అందుకే హైకోర్టు తీర్పు రాగానే వహీద్ ‘ఈ తీర్పు అసంపూర్ణం. కోర్టు కేసు పునర్విచారణకు ఆదేశించ లేదు. రెండు దశాబ్దాల జీవితం నష్టపోయినవారికి పరిహారం గురించి మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా నిజమైన నేరస్థులను పట్టు కొమ్మని ప్రాసిక్యూషన్‌కు చెప్పలేదు. అయితే ఇవాళ్టి భారతదేశంలో ఈ అసంపూర్ణ తీర్పు అయినా ముస్లింలకు గొప్ప విజ యమే’ అన్నాడు. ఈ నిర్దోషులు ఇంతకాలం అనుభవించిన తప్పుడు ముద్ర తర్వాత, విచ్ఛిన్న మైన తమ జీవితాలను పునర్నిర్మించుకోగలరా? ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయమే అన్నమాట మరొకసారి రుజువు అవుతున్నదా?
-ఎన్. వేణుగోపాల్, వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు