
ఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్‌ఎక్స్‌లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.
ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది.
దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.
భయపెడుతున్న ఏఐ..
ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ప్లాట్‌ఫారమ్‌లలో సోషల్ మీడియా ప్రొఫైల్‌లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇ–కామర్స్ సైట్‌లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.
న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?
సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాది (షెట్టి) డీప్‌ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్‌లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.
అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.