
పల్లకీయాత్రకు సర్వం సిద్ధం
సంత్ తుకారాం మహారాజ్ పల్లకీ యాత్ర ప్రత్యేక పూజలు గురువారం ఉదయం దేహూలో ప్రారంభం కానున్నాయి. పల్లకీ యాత్ర పూజను రాష్ర్ట మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రారంభించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
పింప్రి, న్యూస్‌లైన్: సంత్ తుకారాం మహారాజ్ పల్లకీ యాత్ర ప్రత్యేక పూజలు గురువారం ఉదయం దేహూలో ప్రారంభం కానున్నాయి. పల్లకీ యాత్ర పూజను రాష్ర్ట మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రారంభించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. పండరీపూర్ విఠల్‌ను పల్లకీ యాత్ర ద్వారా దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో దేహూ కిటకిట లాడుతోంది.
వైకుంఠ స్థాన మందిరం పరిసరాలు వివిధ దిండీలతో నిండిపోయాయి. పోలీసులు మంగళవారం నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు పింప్రి గురుద్వారా సమితి ఆధ్వర్యంలో వైకుంఠ స్థాన మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
గత ఐదేళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గురుద్వారా కార్యకర్తలు తెలిపారు. ఎనిమిది రోజులుగా ప్రధాన మందిరంలో హరినామ జపం, కీర్తనలు, భజనలు నిర్వహిస్తున్నారు. భక్తులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. దేహూ పరిసరాల పరిశుభ్రతకు 24 గంటలు స్వయం సేవకులు శ్రమిస్తున్నారు. ఇంద్రాయణీ నదీ స్వచ్ఛతకు అందరూ సహకరించాలని, నదిలో చెత్త వేయకూడదని అఖిల విశ్వ గాయత్రీ పరివార్‌కు చెందిన శైలేంద్ర పాటిల్ భక్తులకు పిలుపునిచ్చారు.
అడుగడుగునా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు..
పల్లకీ యాత్ర సందర్భంగా దేహూ, ఆలందిలో పటిష్ట బందోబస్తుతోపాటు నగర పరిషత్ ఆలయ పరిసరాలలో సుమారు 50కి పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేశామని ముఖ ్య అధికారి వినాయక్ డౌండ్కర్ తెలిపారు. భక్తులకు మొబైల్ ఆస్పత్రులతోపాటు మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటుచేశారు.
ప్రత్యేక పూజలు...
గురువారం ఉదయం 5.30 గంటలకు దేహూరోడ్‌లోని భక్త తుకారాం మందిరంలో పాండురంగడి మహాపూజ, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శిలా మందిరంలో ఆరు గంటలకు పూజలు ప్రారంభించనున్నారు. 6.30 గంటలకు వైకుంఠ స్థానం మందిరంలో పూజలు, 7 గంటలకు తపోనిధి నారాయణ మహారాజ్ సమాధి పూజ, 9 నుంచి 11 గంటల వరకు కీర్తనలు, భజనలు, 11 నుంచి విగ్రహాల ప్రతిష్ట ఉంటాయి. నాలుగు గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది.