
జయ జయ విఠల..
భక్త తుకారాం మహారాజ్ 329వ పల్లకీ యాత్ర గురువారం ప్రారంభం కావడంతో లక్షలాదిగా తరలివచ్చిన వార్కారీలతో దేహూ కిక్కిరిసిపోయింది.
పింప్రి, న్యూస్‌లైన్: భక్త తుకారాం మహారాజ్ 329వ పల్లకీ యాత్ర గురువారం ప్రారంభం కావడంతో లక్షలాదిగా తరలివచ్చిన వార్కారీలతో దేహూ కిక్కిరిసిపోయింది. పల్లకీ యాత్ర ద్వారా పండరీపూర్ విఠల్‌ను భక్తులు దర్శించుకోనున్నారు. కాగా ఈ యాత్ర జూలై 8వ తేదీతో ముగియనుంది. లక్షలాది వార్కారీల జయ జయ విఠల నామస్మరణతో దేహూ మారుమోగింది. మహిళలు తలపై తులసి బృందావనాలు, పురుషులు తంబురలు, వీణలు, మృదంగాలు పట్టుకొని పాండురంగడి భక్తి కీర్తనలతో నాట్యాలు చేస్తూ పల్లకీ యాత్రలో పాల్గొన్నారు. తేలికపాటి వర్షం కురవడంతో భక్తులు ఆనందంతో తడిసి పరవశించిపోయారు. గత 24 గంటల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
దేహూలో ఇంద్రాయణి నది తీరం వెంబడి బుధవారం అర్ధరాత్రి నుంచి భక్తులు స్నానాదులు ఆచరించారు. సంత్ తుకారాం మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటుచేశారు. పల్లకీ యాత్ర కోసం వెండి పల్లకీ రథాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వెండి పల్లకి, పాదుకలు, పీఠాన్ని అభిషేకించి అలంకరించారు. పల్లకీయాత్రలో పాల్గొనడానికి 329కి పైగా దిండీ (బృందాలు)లు దేహూ విచ్చేశాయి. ఉదయం 5.30 గంటలకు పాండురంగడి మహాభిషేకం, పంచామృతాభిషేకం, మహాపూజలను నిర్వహించారు. 6 గంటలకు శిలా మందిరంలో మహాపూజ, 6.30 గంటలకు వైకుంఠ స్థాన మందిరంలో పూజలు జరిపారు.
7 గంటలకు తపోనిధి నారాయణ మహారాజ్ సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు మహద్వారం నుంచి దర్శనం కల్పించారు. ఉదయం 11 గంటలకు సంత్ తుకారం మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. పాదుకలను పల్లకీలో ఉంచుకొని తుకారాం ముఖ్య మందిరం నుంచి బయటకు రాగా భక్తులు ఒక్కసారిగా తుకారం, విఠల్ నామస్మరణతో ప్రతిధ్వనింప చేశారు. ఈ పల్లకీ యాత్ర గురువారం దేహులోని ఇనాందార్ సాహెబ్ వాడాలో ఆగి శుక్రవారం ఉదయం శ్రీ క్షేత్రదేహు నుంచి బయలుదేరి అనగద్‌షాహ బాబా వద్ద అభంగ్ హారతీ నిర్వహిస్తారు.
చించోలిలో పాదుకలకు అభంగ్ హారతి నిర్వహించిన అనంతరం నిగిడి మీదుగ వెళ్లి ఆకృడిలోని శ్రీ విఠల్ మందిరంలో శుక్రవారం రాత్రికి బస చేస్తారు. పల్లకీ బందోబస్తుకుగాను సుమారు 1500 మంది పోలీసులు, హోంగార్డులను నియమించారు. వీరితోపాటు 4 బాంబు తనిఖీ బృందాలు పనిచేస్తున్నాయి. పల్లకీ మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. భద్రతా విషయమై పల్లకీ మార్గంలో ప్రతి కూడలిలో నాలుగు నుంచి 5 ధర్మశాలలను పోలీసులకు అప్పగించారు. జేబు దొంగలు, భక్తులకు అసౌకర్యానికి గురి చేస్తున్నవారిని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి విజయ్ మగర్ తెలిపారు. పల్లకీ వెంట 20 మంది కేంద్ర సురక్ష దళానికి చెందిన కమాండోలు కూడా విధులు నిర్వహిస్తున్నారు.