
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ఆకృతులతో మండపాలను రూపొందించి, భక్తులు అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కోల్‌కతాలోని జగత్ ముఖర్జీ పార్క్‌లో ఏర్పాటుచేసిన దుర్గా మండపం అటు సాంకేతికతను ఇటు సంప్రదాయాన్ని మిళితం చేసింది.
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బూన్ ఆర్ బానే’(కృత్రిమ మేథ: వరమా? శాపమా?) అనే థీమ్‌తో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోతున్నదీ ఈ మండపంలో చూపించారు. మానవులు, రోబోలు కలసిమెలసి ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మానవ విలువలపై సాంకేతిక ఆధిపత్యం ప్రత్యక్షంగా ఇక్కడ చూపించారు. కళాకారుడు సుబల్ పాల్ రూపొందించిన ఈ మండపం ఒక పెద్ద టైమ్ మెషీన్ మాదిరిగా కనిపిస్తుంది. సందర్శకులు లోపలికి వెళ్ళేటప్పుడు రోబోటిక్ నగరానికి వెళుతున్నట్లు ఫీల్ అవుతారు.
మండపమంతా లైట్లతో నిండి ఉంది. కీబోర్డులను పై నుంచి వేలాడదీశారు. ఎత్తైన నిర్మాణాలు చుట్టుపక్కల కనిపిస్తాయి. ప్రొజెక్షన్ల ద్వారా సాంకేతికత మానవ జీవితాన్ని ఎలా బోనులో బంధించిందో చూపించారు. అయితే అమ్మవారి విగ్రహం సాంప్రదాయ రూపంలోనే ఉంది. ఆమె పాదాల వద్ద మహిషాసురుడు భూమి నుండి కొంచెం పైకి లేచి కనిపిస్తున్నాడు. కాగా జగత్ ముఖర్జీ పార్క్‌లో ప్రతీయేటా నిర్వహిస్తున్న దుర్గా పూజలు 89వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈ మండపంలో బొంగావ్ లోకల్ రైలు మొదలుకొని నీటి అడుగున నడిచే మెట్రో మార్గాల వరకు అన్నింటినీ కూడా ప్రదర్శించారు.