కోల్‌కతా: కోల్‌కతాలో జరిగే దుర్గా పూజ సంబరాల్లో ఈసారి ఓ వినూత్న కళారూపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా రాయడానికే ఉపయోగించే కలాలను సరికొత్తగా మలచి దుర్గామాత విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పర్యావరణ స్పృహతో పాటు సాంప్రదాయ భక్తిని మేళవిస్తూ, దాదాపు 13 వేల రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పెన్నులు, రీఫిళ్లను జోడించి ఈ విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. ఇది మట్టితో చేశారా లేక లోహంతో చేశారా అనే తేడా కూడా గుర్తించలేనంత నేర్పుతో దీనిని తీర్చిదిద్దారు.
ఈ అద్భుత కళారూపాన్ని కళాకారుడు చంద్రనాథ్ సాహా రూపొందించారు. 5.5 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు తో ఈ విగ్రహం కొలువుదీరింది. సాధారణ ప్లాస్టిక్ పెన్నులతో దేవీ రూపాన్ని, ఆమె గాంభీర్యాన్ని సహజంగా తీసుకురావడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని సాహా తెలిపారు. వేల సంఖ్యలో పెన్నులను ఒకచోట పేర్చి ఒక మహోన్నత ఆకారాన్ని సృష్టించడంలో ఆయన నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ ప్రత్యేక విగ్రహాన్ని కోల్‌కతాలోని ప్రసిద్ధ 'త్రిధార సమ్మేళని' దుర్గా పూజా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రధాన సాంప్రదాయ పూజా విగ్రహం పక్కనే ఒక ప్రత్యేక కళాకృతిగా దీనిని భక్తుల సందర్శనార్థం ఉంచారు. పూజల కోసం వచ్చే భక్తులు ఈ వినూత్న శైలిని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, వ్యర్థాలను సైతం దివ్య రూపాలుగా మలచవచ్చని అంటున్నారు.
ఈ రూపకల్పనలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. సంప్రదాయ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా నిమజ్జనం చేస్తారు గానీ, పెన్నులతో చేసిన ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. పూజా ఉత్సవాలు ముగిసిన తర్వాత ప్రతి పెన్నును విడదీసి, ఆ ప్లాస్టిక్‌ను తిరిగి రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తారు. దీని ద్వారా ఇతర నిత్యావసర వస్తువులను తయారు చేస్తారు. నిరుపయోగంగా భావించి పారేసే ప్లాస్టిక్‌తోనూ సరికొత్త కళను సృష్టించవచ్చని, ప్రకృతిని కాపాడుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ ప్రతిమ అందిస్తోంది.
ఇదీ చదవండి: రాహుల్‌ను చీదరించుకుంటున్నారు: కిషన్ రెడ్డి


