
అహ్మదాబాద్: విశ్వాస్ కుమార్ రమేష్... జూన్ 12న జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. ఈయన ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా 270 మంది మరణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఫుటేజ్‌లో రమేష్ రక్తంతో తడిసి, అంబులెన్స్ వైపు కుంటుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ప్రమాదం జరిగి, నెల రోజులు గడిచిన దరిమిలా విశ్వాస్ కుమార్ రమేష్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు?
అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ విషాదాన్ని మరువలేకపోతున్నాడు. ఈ ఘటన రమేష్‌ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. అతని బంధువు సన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్‌ను వెంటాడుతున్నాయి. అతను ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం, అతని సోదరుని మరణం మొదలైన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. విదేశాలలో ఉంటున్న మా బంధువులు.. రమేష్ తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అయితే రమేష్ ఎవరితోనూ మాట్లాడటం లేదు. విమాన ప్రమాదం, అతని సోదరుని మరణం దరిమిలా అతనికి అయిన గాయం ఇంకా మానలేదు. రమేశ్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడు. తరువాత నిద్రపోవడం లేదు. చికిత్స కోసం మేము అతనిని రెండు రోజుల క్రితం మానసిక వైద్యనిపుణుని వద్దకు తీసుకెళ్లాం. అతనికి ఇప్పుడే చికిత్స ప్రారంభమైనందున, లండన్ వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు’ అని తెలిపారు.
జూన్ 17న రమేష్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయిందని వివరించాడు. తన సీటు, 11ఏ.. ఎడమ వైపున ఉన్న అత్యవసర తలుపుకు దగ్గరగా ఉందని తెలిపారు. జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోకి కూలిపోయింది.