విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం తగదు: అమిత్‌ షా

Does not suit any leader to criticise the country abroad says Amit Shah - Sakshi

పటన్‌: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో దేశాన్ని విమర్శించడం, అంతర్గత రాజకీయాలను గురించి మాట్లాడటాన్ని హోం మంత్రి అమిత్‌ షా తప్పుపట్టారు. ఇటువంటి వాటిపై రాహుల్‌ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్‌లోని పటన్‌ జిల్లా సిద్ధ్‌పూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా భారత రాజకీయాల గురించి భారత్‌లోనే మాట్లాడాలి.

ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే విదేశాల్లో ఉండగా దేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం సరికాదు. రాహుల్‌ బాబా.. దేశ ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి’అని ఆయన పేర్కొన్నారు. ‘వేసవి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రాహుల్‌ బాబా విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడున్న సమయంలోనూ దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరికాదన్న విషయాన్ని తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని రాహుల్‌కు  సలహా ఇస్తున్నా’అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. రాహుల్‌ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నా కాంగ్రెస్‌ మాత్రం భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపలేదని విమర్శించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top