బాల నేరస్తుల పేర్లు ప్రచురించవద్దు!  | Do not publish the names of juvenile offenders | Sakshi
Sakshi News home page

బాల నేరస్తుల పేర్లు ప్రచురించవద్దు! 

Oct 11 2026 6:06 AM | Updated on Oct 11 2026 6:06 AM

Do not publish the names of juvenile offenders

సీజేఐ సూర్యకాంత్‌ స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో చిక్కుకునే పిల్లల పేర్లను వార్తుల, ఇంటర్నెట్‌లలో ప్రసారం చేయడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శనివారం స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో చిక్కుకున్న పిల్లలు అన్న పదబంధం ఒక పరిస్థితిని వివరిస్తుందని.. ఆయా పిల్లల ఉనికిని కాదని ఆయన అన్నారు. జువనైల్‌ జస్టిస్‌ చట్టం దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ, యునిసెఫ్‌ సంయుక్తంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక చట్టానికి పదేళ్లు అన్నది చాలా చిన్న కాలావధి అయినప్పటికీ బాల్యంలో సగం కంటే ఎక్కువని అన్నారు.

 బాల్యంలో నేరస్తుడిగా ముద్రపడ్డ  వారి కంటే తప్పును దిద్దుకునేందుకు మరో అవకాశం లభించన వారు సమాజానికి ఎక్కువ ప్రయోజనకారిగా మారే అవకాశముందన్న నమ్మకంతో ఈ చట్టం రూపొందిందని తెలిపారు. గతం తాలూకూ ఛాయ వారి (బాల నేరస్తులు) భవిష్యత్తుపై పడకపోతేనే ఈ ప్రయాణం ముగుస్తుందని, అందుకే వారి పేర్లను వార్తల్లో, ఇంటర్నెట్‌లో ప్రచారం చేయకూడదని సీజేఐ చెప్పారు. బాలల కోసం సుశిక్షితులైన న్యాయవాదులతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సీజేఐ కోరారు.  

సమావేశం ప్రారంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న మాట్లాడుతూ... ఎవరి (బాలలు)కోసం ఈ చట్టం చేశారో వారికి పదేళ్ల కాలంలో ఏం జరిగిందన్నది సమీక్షించాలని సూచించారు. పిల్లల ఆందోళలను అర్థం చేసుకోవడం పెద్దవారిగా మన బాధ్యతని, వారి సమస్యలను కొట్టిపారేయలేమని అలా చేస్తే తమను ఎవరూ పట్టించుకవడం లేదన్న భావనకు వారు గురికావచ్చునని వివరించారు. పిల్లలతోపాటు వారి ఆందోళనలు, భయాలు కూడా మనవి కావాలని సూచించారు.  జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ‘చిన్నస్థాయి క్రిమినల్‌ కోర్టు కాదని ఆమె స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement