
బీజేపీ మహిళా కార్యకర్తకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన
బిహార్ కార్యకర్తలతో వర్చువల్‌గా సంభాషణ
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా
నవంబర్ 14న మరో దీపావళి వస్తుందని వెల్లడి
న్యూఢిల్లీ: మహిళా శక్తే దేశానికి బలం, రక్షణ కవచం, స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తనను సార్ అని పిలవొద్దని, సోదరుడిగా సంబోధించాలని బిహార్‌కు చెందిన బీజేపీ బూత్ స్థాయి మహిళా కార్యకర్తకు సూచించారు. బిహార్‌లో నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, అదేరోజు ప్రజలు మరో దీపావళి నిర్వహించుకోబోతున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి విజయంలో మహిళలే కీలకపాత్ర పోషించబోతున్నారని తెలిపారు.
బిహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి నమో యాప్ ద్వారా వారితో సంభాషించారు. ప్రజాస్వామ్య వేడుకలో మహిళలంతా ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ గుంపులుగా వెళ్లి ఓటు వేయాలని, పాటలు పాడుతూ, థాలీలు(గిన్నెలు) మోగిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బిహార్ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి వస్తోందని వ్యాఖ్యానించారు. సోదరీమణులు, ఆడబిడ్డల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టంచేశారు.
నా తరఫున గ్యారంటీ ఇవ్వండి
భాయి దూజ్ పండుగ సందర్భంగా ఈ నెల 23న సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. లఖ్‌పతీ దీదీలను, డ్రోన్ దీదీలను గౌరవించుకోవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని కోరారు.
‘ఏక్‌జుట్ ఎన్డీఏ, ఏక్‌జుట్ బిహార్(ఐక్య ఎన్డీఏ, ఐక్య బిహార్)–ఇసే బనేగీ సుశాసన్ కీ సర్కార్’ అనే నినాదాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చారు. మరోసారి సుపరిపాలన అందిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో కచ్చితంగా విజయం లభిస్తుందన్నారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఒక మోదీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తన తరఫున ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు.
పథకాలకు సంబంధించిన వీడియోలను అందరికీ చూపించాలన్నారు. బిహార్‌లో గతంలో జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని, అప్పటి పరిస్థితుల గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జేడీ పాలనపై విరుచుకుపడ్డారు. బిహార్‌లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ నక్సలైట్ల చేతికి అప్పగించవద్దని ప్రజలను కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల నుంచి బిహార్‌ను రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే ఉందని మోదీ ఉద్ఘాటించారు. బిహార్‌లో నవంబర్ 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.