
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళలో సామూహిక ఖననాల కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై ప్రత్యేక బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా, పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడొకరు తాను వివిధ ప్రాంతాల్లో మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన మీదట సిట్ అధికారులు నిజానిజాలు తేల్చేందుకు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే 13వ సైట్‌లో తవ్వకాల పనులు నిలిచిపోయాయి. 16వ ప్రదేశంలోనూ తవ్వకాలు పూర్తిచేసిన సిట్ అధికారులు 13వ సైట్‌లో తవ్వకాలు జరిపే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ఖననాలపై ఫిర్యాదు చేసిన స్వీపర్ తాను 13 వ సైట్‌లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టానని సిట్ అధికారులకు తెలిపాడు. దీంతో ఇక్కడ తవ్వకాలపై అధికారులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. కాగా బాహుబలి కొండలలో సిట్ అధికారులు 10 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పు గల కందకం తవ్వించినప్పటికీ అక్కడ ఎటువంటి మృతదేహం గానీ, మానవ అవశేషాలు గానీ లభ్యం కాలేదు. ఇప్పటివరకు 16 వేర్వేరు ప్రదేశాలలో తవ్వకాలు జరిగాయి. వీటిలో సైట్ నంబర్ 6,11 వద్ద అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా సైట్ నంబర్ 13 వద్ద తవ్వకాలు నిలిపివేశామని సిట్ అధికారులు చెబుతున్నారు.

తాజాగా ఈ కేసులో ఒక మహిళ ఆ పారిశుద్ధ్య కార్మికుని వాదనను ధృవీకరించింది. తాను ఒకసారి ఆ పారిశుధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెడుతుండటాన్ని చూశానని సిట్ అధికారులకు తెలిపింది. మరోవైపు ధర్మస్థళపై దురుద్దేశపూరిత ప్రచారం జరుగుతోందని గౌరిబిదనూర్ బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఆగస్టు 16న యెలహంక నుండి ధర్మస్థల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్మస్థళలో వందలాది మృతదేహాలను ఖననం చేశారనే వాదన అబద్ధమని, ఇది హిందూ సమాజాన్ని అవమానించడమేనన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, అతని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.