చావు తెలివి తేటలు | Delhi police arrest UP Man for using fake death certificate to escape trial | Sakshi
Sakshi News home page

చావు తెలివి తేటలు

Oct 12 2025 5:48 AM | Updated on Oct 12 2025 5:48 AM

Delhi police arrest UP Man for using fake death certificate to escape trial

నకిలీ మరణ ధ్రువపత్రంతో కోర్టుకు దొంగ టోకరా

న్యూఢిల్లీ: న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఒక దొంగగారు ఎంత దూరం వెళ్లారో తెలుసా? ఏకంగా యమలోకం వరకూ!.. అవును, దొంగతనాలు చేసిచేసి.. విచారణలంటే విసుగొచ్చిన ఒక మహా మేధావేం చేశాడో తెలుసా? తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెండేళ్లుగా ’చనిపో యినవాడి’ హోదాలో హాయిగా బతికేస్తున్నాడు. ఈ టెక్నాలజీ ఉంది చూశారూ.. అదిమాత్రం మనోడిని రెండేళ్ల తర్వాత పట్టించేసింది పాపం.

కోర్టులు, కేసులు నా వల్లకాదెహే..
ఆ ఘనుడి పేరు వీరేందర్‌ విమల్‌ (35). ఇతను దొంగతనాలు, తుపాకుల కేసుల్లో రెగ్యులర్‌ కస్టమర్‌. కోర్టులో నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు వస్తూ ఉంటే, విమల్‌కు ఒళ్లు మండింది. ’ఈ కోర్టులు, పోలీసులు, కేసులు... నా వల్ల కాదసలు! నేను ఇంకో దారి చూసుకోవాలి,’ అనుకున్నాడు. సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కానీ ఈ వీరేందర్‌ విమల్‌ మాత్రం.. న్యాయం నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటిస్తూ, ’భూలోక స్వర్గానికి’ వెళ్లిపోయాడు!

కళ్లు మూసుకుని.. ‘కన్ను మూసినట్లు’ ఇచ్చేశారు
2021లో, విమల్‌ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. పాత సినిమాల్లో విలన్లు చేసే పనిని, ఈయన ఏకంగా ప్రభుత్వంతోనే చేయించాడు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ జారీ చేసినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. ఆ సర్టిఫికెట్‌లో, ‘ఈ వీరేందర్‌ విమల్‌ అనే వ్యక్తి ఇక లేరు, ఆగస్ట్‌ 24, 2021న మరణించితిరి’ అని ఉంది! కోర్టులో ఆ ’చావు పత్రం’ సమర్పించగానే, జడ్జి గారు కూడా ‘మరణించిన వ్యక్తిని ఏం విచారించగలంలే’ అనుకుని కేసులను క్లోజ్‌ చేసేశారు. అక్కడ విమల్, ’చనిపోయిన వారి’ జాబితాలో చేరి, హాయిగా బతికేస్తున్నాడు. పోలీసులు కూడా, ‘పాపం, వాడు పోయాడు’ అని సైలెంట్‌ అయ్యారు.

కానీ ట్విస్ట్‌ ఏంటంటే..
పాత ఫైళ్లు దుమ్ము దులిపి చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌) ఆదిత్య గౌతమ్‌ గారికి డౌటనుమానం వచ్చింది. వెంటనే ’విమల్‌ మరణ మిస్టరీని తెరిచారు. తీరా చూస్తే.. ‘అసలు చావలేదని.. ఆ మరణ ధ్రువపత్రం అంతా నకిలీది!’ అని తేలింది. పోలీసులేమో... అసలు ఎవడీడు? చావు పేరిట కూడా మమ్మల్ని మోసం చేస్తాడా?’ అని పళ్లు కొరికారు.

గోరఖ్‌పూర్‌లో ‘బతికున్న దెయ్యం’
పోలీసులు అతన్ని వెతకడానికి.. పాత పద్ధతులు వదిలేశారు. ’క్రైమ్‌ కుండ్లి’ (బయోమెట్రిక్‌ డేటాబేస్‌), ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ టెక్నాలజీని వాడారు. అంతే మనోడు అడ్డంగా దొరికిపోయాడు. విమల్‌ తాజా ఫొటోని ఆ సాఫ్ట్‌వేర్‌లో పడేయగానే.. ‘ఇతను చనిపోలేదు, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్లో బిందాస్‌గా బతికేస్తున్నాడు‘ అని చూపించింది! పోలీసులు గోరఖ్‌పూర్‌ వెళ్ళి, రెండేళ్లుగా ఖుషీఖుషీగా బతికేస్తున్న ఆ ’బతికున్న దెయ్యాన్ని’ పట్టుకుని లోపలేసేశారు.

నీతి: దొంగతనాలు చేయకండి. ఒకవేళ చేసినా.. దయచేసి ’చచ్చిపోయినట్లు’ నటించకండి. ఎందుకంటే, ఢిల్లీ పోలీసుల టెక్నాలజీ... మీరెక్కడున్నా జాతకం పట్టిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement