breaking news
Face registration software
-
చావు తెలివి తేటలు
న్యూఢిల్లీ: న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఒక దొంగగారు ఎంత దూరం వెళ్లారో తెలుసా? ఏకంగా యమలోకం వరకూ!.. అవును, దొంగతనాలు చేసిచేసి.. విచారణలంటే విసుగొచ్చిన ఒక మహా మేధావేం చేశాడో తెలుసా? తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెండేళ్లుగా ’చనిపో యినవాడి’ హోదాలో హాయిగా బతికేస్తున్నాడు. ఈ టెక్నాలజీ ఉంది చూశారూ.. అదిమాత్రం మనోడిని రెండేళ్ల తర్వాత పట్టించేసింది పాపం.కోర్టులు, కేసులు నా వల్లకాదెహే..ఆ ఘనుడి పేరు వీరేందర్ విమల్ (35). ఇతను దొంగతనాలు, తుపాకుల కేసుల్లో రెగ్యులర్ కస్టమర్. కోర్టులో నాన్–బెయిలబుల్ వారెంట్లు వస్తూ ఉంటే, విమల్‌కు ఒళ్లు మండింది. ’ఈ కోర్టులు, పోలీసులు, కేసులు... నా వల్ల కాదసలు! నేను ఇంకో దారి చూసుకోవాలి,’ అనుకున్నాడు. సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కానీ ఈ వీరేందర్ విమల్ మాత్రం.. న్యాయం నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటిస్తూ, ’భూలోక స్వర్గానికి’ వెళ్లిపోయాడు!కళ్లు మూసుకుని.. ‘కన్ను మూసినట్లు’ ఇచ్చేశారు2021లో, విమల్ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. పాత సినిమాల్లో విలన్లు చేసే పనిని, ఈయన ఏకంగా ప్రభుత్వంతోనే చేయించాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. ఆ సర్టిఫికెట్లో, ‘ఈ వీరేందర్ విమల్ అనే వ్యక్తి ఇక లేరు, ఆగస్ట్ 24, 2021న మరణించితిరి’ అని ఉంది! కోర్టులో ఆ ’చావు పత్రం’ సమర్పించగానే, జడ్జి గారు కూడా ‘మరణించిన వ్యక్తిని ఏం విచారించగలంలే’ అనుకుని కేసులను క్లోజ్ చేసేశారు. అక్కడ విమల్, ’చనిపోయిన వారి’ జాబితాలో చేరి, హాయిగా బతికేస్తున్నాడు. పోలీసులు కూడా, ‘పాపం, వాడు పోయాడు’ అని సైలెంట్ అయ్యారు.కానీ ట్విస్ట్ ఏంటంటే..పాత ఫైళ్లు దుమ్ము దులిపి చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఆదిత్య గౌతమ్ గారికి డౌటనుమానం వచ్చింది. వెంటనే ’విమల్ మరణ మిస్టరీని తెరిచారు. తీరా చూస్తే.. ‘అసలు చావలేదని.. ఆ మరణ ధ్రువపత్రం అంతా నకిలీది!’ అని తేలింది. పోలీసులేమో... అసలు ఎవడీడు? చావు పేరిట కూడా మమ్మల్ని మోసం చేస్తాడా?’ అని పళ్లు కొరికారు.గోరఖ్‌పూర్‌లో ‘బతికున్న దెయ్యం’పోలీసులు అతన్ని వెతకడానికి.. పాత పద్ధతులు వదిలేశారు. ’క్రైమ్ కుండ్లి’ (బయోమెట్రిక్ డేటాబేస్), ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీని వాడారు. అంతే మనోడు అడ్డంగా దొరికిపోయాడు. విమల్ తాజా ఫొటోని ఆ సాఫ్ట్‌వేర్‌లో పడేయగానే.. ‘ఇతను చనిపోలేదు, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బిందాస్‌గా బతికేస్తున్నాడు‘ అని చూపించింది! పోలీసులు గోరఖ్‌పూర్ వెళ్ళి, రెండేళ్లుగా ఖుషీఖుషీగా బతికేస్తున్న ఆ ’బతికున్న దెయ్యాన్ని’ పట్టుకుని లోపలేసేశారు.నీతి: దొంగతనాలు చేయకండి. ఒకవేళ చేసినా.. దయచేసి ’చచ్చిపోయినట్లు’ నటించకండి. ఎందుకంటే, ఢిల్లీ పోలీసుల టెక్నాలజీ... మీరెక్కడున్నా జాతకం పట్టిస్తుంది. -
‘తపాలా’కు సాఫ్ట్వేర్ రక్షణ కవచం..!
సాక్షి, హైదరాబాద్: తపాలా కోశాగారం, అన్ని కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమైన సర్వర్‌కు భద్రత కల్పించేందుకు పోస్టల్ శాఖ సాఫ్ట్‌వేర్‌తో రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంది. కోట్ల రూపాయల నిధులు, ఎస్బీఐలాంటి భారీ బ్యాంకింగ్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల నేపథ్యంలో అత్యంత విలువైన సాఫ్ట్వేర్ సమాచారం వీటిలో నిక్షిప్తమైనందున.. చౌర్యానికి వీలు లేకుండా ఫేస్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌తో సాంకేతిక నిఘాను ఏర్పాటు చేసుకుంది. దేశంలోనే తొలిసారి ఏపీ తపాలా సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధి) దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. కేవలం ముగ్గురికే అనుమతి... ఇటీవల తపాలా శాఖ ఆదాయం భారీగా పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లాభాలబాట పట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తపాలా కోశాగారంలో వందల కోట్ల నిధులు చేరతాయి. రోజువారీ కార్యకలాపాల నిధులు ఇక్కడి నుంచే బట్వాడా అవుతున్నాయి. పైగా బ్యాంకింగ్ రంగంపై తపాలా శాఖ దృష్టి సారించింది. పొదుపు ఖాతాలు పెంచుకోవటంతోపాటు ఎస్బీఐ లాంటి సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకుంటోంది. అంతర్జాతీయ కొరియర్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది. ఫలితంగా అత్యంత విలువైన సమాచారం సర్వర్‌లో నిక్షిప్తమవుతోంది. అయితే ఖజానాకు, సర్వర్‌కు రక్షణ తపాలా శాఖకు సవాల్‌గా మారింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు, సమాచార చౌర్యం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను తపాలా శాఖ ఏర్పాటు చేసుకుంది. సొంతంగానే ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్న పోస్టల్ విభాగం.. దానికి అవసరమైన పరికరాలను ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేసింది. కోశాగారం, సర్వర్ గదులకు దీనిని అనుసంధానించింది. ముగ్గురు అధికారుల ముఖాల (ఫేస్)ను ఇందులో రిజిస్టర్ చేశారు. ఫేస్ రిజిస్ట్రేషన్‌తోపాటు బొటనవేలి ముద్రలనూ తీసుకున్నారు. సంబంధిత పరికరాలను ఆ గదుల తలుపుల వద్ద ఏర్పాటు చేశారు. పరికరంలో గుర్తులు నమోదైన అధికారులు ఉన్నప్పుడు.. అందులో నిక్షిప్తమైన చిత్రంతో సరిపోలితేనే అది గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత బొటనవేలి ముద్ర సరిపోలితే తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది. అనుమతి ఉన్న అధికారులు లోనికి వెళ్లినప్పుడు సెకన్లతో పాటు సమయం, చిత్రం రికార్డవుతుంది. దాన్ని ప్రింట్ రూపంలో పొందే వెసులుబాటు ఉంది. ఫలితంగా అనుమతి ఉన్న వ్యక్తులు తప్పు చేసినా సులభంగా దొరికిపోతారు. ఇక ఫేస్ రిజిస్ట్రేషన్ టెక్నాలజీ వల్ల ఇతరులు లోనికి ప్రవేశించేందుకు అవకాశమే లేదని అధికారులు చెపుతున్నారు. దీని వల్ల తపాలా శాఖ నిధులు, కీలక సమాచారానికి పూర్తి భద్రత కలిగినట్టయ్యింది.