దేశ రాజధానిలో వాయునాణ్యత మరీ ఘోరంగా దిగజారిపోయింది. శనివారం చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 400 కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో.. ఎయిర్ ఎమర్జెన్సీని విధిస్తూ రెడ్ జోన్‌లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్‌లలో ఇవాళ కాలుష్య నమోదును పర్యవేక్షించారు. ఇందులో వాజిర్‌పూర్ వద్ద ఏక్యూఐ 420ని తాకింది. అలాగే.. బురారీలో 418, వివేక్ విహార్‌లో 411, అలీపూర్‌లో 404, ఐటీవో వద్ద 402 ఏఐక్యూని చేరుకుంది. శుక్రవారం 322 ఏఐక్యూతో దేశంలోనే అత్యధిక నగరంగా నిలిచిన ఢిల్లీ నగరం.. మొత్తంగా ఇవాళ 361తో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హర్యానాలోని కైథల్(373) నిలిచింది. అంతేకాదు..
నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోనూ ఎయిర్‌క్వాలిటీ గణనీయంగా పడిపోయింది. నోయిడాలో ఏక్యూఐ 354, గ్రేటర్ నోయిడాలో 336, ఘజియాబాద్‌లో 339.. ఇలా అంతటా వెరీ పూర్ కేటగిరీనే నమోదు అయ్యింది.
శనివారం రోజున ఢిల్లీలో గాలి కాలుష్యంలో ప్రధానంగా PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయని గుర్తించారు. Decision Support System (DSS) అంచనా ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో సుమారు 30 శాతం పంట అవశేషాల దహనం (stubble burning) వల్ల, 15.2 శాతం వాహనాల ఉద్గారాల వల్ల ఏర్పడింది.
పంట దహనం వల్ల విడుదలయ్యే పొగ, ధూళి కణాలు ఢిల్లీ గగనతలాన్ని కమ్మేస్తూ, గాలి నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది తెలిసిందే. శుక్రవారం నాటి ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. పంజాబ్‌లో 100, హర్యానాలో 18, ఉత్తర ప్రదేశ్‌లో 164 పంట అవశేషాల దహనం (stubble burning) ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

చరిత్రలో అత్యధిక కాలుష్యం..
భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా AQI (Air Quality Index) నమోదైన రోజు 2025 అక్టోబర్ 31, బర్నాలా (Barnala), పంజాబ్‌లో జరిగింది. అక్కడ AQI స్థాయి 890కి చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. అంతకు ముందు.. 2024లో ఢిల్లీ AQI 795తో చరిత్రలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా నిలిచింది.

ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన సీఎం
తీవ్ర వాయుకాలుష్యం దృష్ట్యా.. ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించారు సీఎం రేఖా గుప్తా. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ చేయాలని, ప్రజా రవాణా ఉపయోగించాలని, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


