దద్దరిల్లిన సరిహద్దులు | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన సరిహద్దులు

Published Thu, Feb 22 2024 5:55 AM

Delhi Chalo: Farmers reject central offer and continue to march - Sakshi

చండీగఢ్‌: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్‌–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్‌ పాయింట్లు దద్దరిల్లిపోయాయి.

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్‌ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.

శంభు బోర్డర్‌ పాయింట్‌ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్‌ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు.

 
Advertisement
 
Advertisement