కృత్రిమ మేధ (AI) సాంకేతికత దుర్వినియోగం మరోసారి సినీ పరిశ్రమను కుదిపేసింది. ప్రముఖ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించినట్లు ప్రచారం చేసిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు పూర్తిగా నకిలీవని తేలడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. పలువురు నటి చూపించిన చొరవను అభినందిస్తున్నారు.
'కాంతార' ఫేమ్ నటి రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ ఫొటోలు, వీడియోలు తీవ్ర వివాదానికి దారితీశాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో ఫొటోషూట్ చేసినట్లు ప్రచారం కాగా.. ఆ వీడియోలు, ఫొటోలు పూర్తిగా ఏఐ సాయంతో సృష్టించినవేనని రుక్మిణి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
‘‘నా పేరుతో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్. వాటిని ఏఐ సాయంతో రూపొందించారు. ఈ వ్యవహారాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. వాటిని సృష్టించిన వారిపైనా, ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు ప్రారంభించాం’’ అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై రుక్మిణి వసంత్ బెంగళూరు నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఏఐ సాంకేతికతను ఉపయోగించి అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల తన గౌరవానికి భంగం కలగడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో బాగలకోట జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన రవికుమార్ (24), ప్రస్తుతం బెంగళూరులోని కామాక్షిపాళ్యలో నివసిస్తున్న చంద్రకాంత్ (33), మహాలక్ష్మీనగర్‌కు చెందిన రంజిత్ (25) ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో ఏఐ సాయంతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చిత్రాలు సినీ తారలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నటీమణుల ఫొటోలను అభ్యంతరకరంగా మార్చి వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పబ్లిక్ ఈవెంట్లలో మహిళా నటీమణుల శరీర భాగాలను జూమ్ చేసి చిత్రీకరించడంపై రుక్మిణి వసంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఐ సాయంతో ఏకంగా నకిలీ ఫొటోషూట్‌లను సృష్టించడంపై పోరాటం మొదలుపెట్టి విజయవంతం అయ్యారు.
ఇటీవల పలువురు సినీ నటీమణులు, టెలివిజన్ యాంకర్లు కూడా తమ పేర్లతో ప్రచారం అవుతున్న ఏఐ ఫొటోలు, వీడియోలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ కూడా ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.


