సామాజిక మాధ్యమాల్లో లక్షలాది వీడియోల చక్కర్లు
అత్యధికంగా షారుఖ్, అలియా భట్, మస్క్ వీడియోలు
వాటితో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పలు కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లుగా సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు సైతం ఉన్నాయి. దీంతో ఏది నిజమైనదో, ఏది కాదో అంతుబట్టడంలేదు. నిజమైన వీడియోలను పోలిన ఈ మోసపూరిత కంటెంట్ ఆన్‌లైన్ స్కామ్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, స్పెషల్ డెస్క్
మోసగాళ్ల మాయ..
సామాజిక మాధ్యమాల్లో అనేక వైరల్ వీడియోలలో పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ సెలెబ్రిటీలు కనిపిస్తున్నారు. ఈ వీడియోలు చూడడానికి నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోలను మోసగాళ్లు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీ మ్యాకఫీ 2025 సంవత్సరానికిగాను ‘మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీ: డీప్‌ఫేక్ డిసెప్షన్ లిస్ట్’విడుదల చేసింది. భారత్‌లో డీప్‌ఫేక్ సెలబ్రిటీ వీడియోల్లో అత్యధికంగా షారుఖ్ ఖాన్ దర్శనమిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సినీనటి అలియా భట్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. 2025 ఆగస్ట్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన మ్యాకఫీ సర్వేలో ఆ్రస్టేలియా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, జపాన్, యూకే, యూఎస్‌కు చెందిన వేలాది మంది వినియోగదారులు పాలుపంచుకున్నారు.
డీప్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో..
ఏఐని ఉపయోగించి ప్రత్యేకంగా డీప్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో సృష్టించిన వీడియో, ఇమేజ్, ఆడియోను డీప్‌ఫేక్ అంటారు. నిజమైన వ్యక్తి ఎప్పుడూ చేయని పనిని చేస్తున్నట్లు లేదా చెబుతున్నట్లు చూపించడానికి.. వాస్తవికత ఉట్టిపడేలా కంప్యూటర్ సాయంతో, ఇప్పటికే ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియోలను అనుకూలంగా మార్చుకుని నకిలీ కంటెంట్ తయారు చేయడమే ఈ డీప్‌ఫేక్ ప్రత్యేకత. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, మోసం వంటి తప్పుడు ప్రయోజనాల కోసం డీప్‌ఫేక్‌లను ఉపయోగిస్తున్నారు. నకిలీ ఎండార్స్‌మెంట్స్, ఫాలోవర్లను పెంచుకోవడానికి బహుమతులను ఇవ్వడం వంటివి ప్రోత్సహించడానికి, ప్రజలను మోసపూరిత వెబ్‌సైట్స్, ఫిషింగ్ లింక్స్ లేదా హానికరమైన డౌన్‌లోడ్స్ వైపు మళ్లించడానికి డీప్‌ఫేక్‌లలో సెలబ్రిటీల పేర్లను సైబర్ నేరస్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
సగటున రూ. 34,500 నష్టం..
సైబర్ నేరస్తులు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి భారత్‌కు చెందిన ప్రసిద్ధ వ్యక్తుల వరకు వారి అనుమతి లేకుండా, వారి వీడియోలు, పేర్లను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారని మ్యాకఫీ వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో నకిలీ లేదా ఏఐతో రూపొందిన సెలబ్రిటీ ప్రకటనల వీడియోలకు బలయ్యారని నివేదిక వెల్లడించింది. ఫలితంగా ఒక్కో బాధితుడికి సగటున రూ. 34,500 నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఆన్‌లైన్ ప్రముఖులున్న డీప్‌ఫేక్ కంటెంట్‌ను 60% మంది భారతీయులు వీక్షించారు. మోసపూరిత కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని మ్యాకఫీ తెలిపింది.

మూడు సెకన్ల ప్రసంగంతో..
సెలబ్రిటీల వీడియోలు, చిత్రాలు, స్వరాన్ని వారి అనుమతి లేకుండా ఉపయోగిస్తూ డీప్‌ఫేక్ వీడియోలతో సామాన్యులను మోసం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. మూడు సెకన్ల ప్రసంగం ఉంటే చాలు.. స్కా మర్లు ఇప్పుడు నమ్మశక్యం కాని విధంగా డీప్‌ఫేక్‌లను రూపొందిస్తున్నారని మ్యాకఫీ వెల్లడించింది. ఇటువంటి డీప్‌ఫేక్ కంటెంట్‌లో చర్మ సంరక్షణ వస్తువులకు సంబంధించిన వీడియోలు 42% ఉన్నాయి. బహుమతులు 41%, క్రిప్టోకరెన్సీ లేదా ట్రేడింగ్ స్కీమ్స్ వీడియోలు 40% ఉన్నాయి.
వేగంగా వ్యాప్తి..
‘డీప్‌ఫేక్‌లు సైబర్ నేరస్తుల మోసపూరిత విధానాలను మా ర్చాయి. ఒకప్పుడు డిజిటల్ ఉపకరణం, కంప్యూటర్, నెట్‌వర్క్‌లోకి మోసపూరితంగా సైబర్ నేరగాళ్లు చొరబడి (హ్యా క్) అ«దీనంలోకి తీసుకునేవాళ్లు. ఇప్పుడు మానవ నమ్మకా న్ని హ్యాక్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇప్పుడు మనం ఆరాధించే వ్యక్తుల స్వరాలు, ముఖాలు, ప్రవర్తనలను సులభంగా అ నుకరించగలదు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్ దే శంలో ప్రతిరోజూ లక్షలాది మందికి దర్శనమిస్తుండటంతో ఇటువంటి నకిలీలు తక్షణమే వ్యాప్తి చెందుతాయి’అని మ్యా కఫీ నివేదిక వివరించింది. భారత్‌లోని సెలబ్రిటీ సంస్కృతి, కోట్లాదిగా ఉన్న ఆన్‌లైన్ యూజర్లు వెరసి ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.


