
‘ఓపీటీ’ని పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో అగ్రరాజ్యం
అత్యధికంగా ప్రభావితమయ్యేది భారతీయులే
యూఎస్ అభివృద్ధిలో కీలకం ‘స్టెమ్’ ఉద్యోగులే
ప్రభుత్వ నిర్ణయంతో వారిపైనా తీవ్ర ప్రభావం
హెచ్ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ( స్టెమ్) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.
తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.
అనుభవం.. అవకాశాలు!
చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు.. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.
‘స్టెమ్’ మీద దెబ్బ
అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే.
ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్నవారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం.